mt_logo

మహిళా కమీషన్ నోటీసులకు సమాధానం ఇచ్చిన కేటీఆర్

మహిళలంటే తనకు ఎనలేని గౌరవముందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల ఓ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలకు మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

మహిళ కమీషన్ కార్యాలయానికి చేరుకునేందుకు ఉదయం పది గంటలకే కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ మహిళ నేతలతో కలిసి 11 గంటల వరకు మహిళా కమీషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్‌ను కలిసి తన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

యధాలాపంగా తాను చేసిన వ్యాఖ్యలకు ఇది వరకే క్షమాపణలు కోరానని ఆయన అన్నారు. మహిళలపై తనకు అపారమైన గౌరవముందని చెప్పారు. చట్టమన్నా, రాజ్యాంగబద్ద సంస్థలన్న తనకు గౌరవముందని అందుకే స్వయంగా హాజరై తన సమాధానం ఇచ్చానని చెప్పారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని.. ఒక్కోసారి మాట దొర్లితే క్షమాపణ చెప్పే సంస్కారం ఉండాలన్నారు.

ఐతే కేటీఆర్ మహిళా కమీషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ మహిళా నేతలు హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు సంఘీభావంగా వచ్చిన బీఆర్ఎస్ మహిళ నాయకులపై దాడికి దిగారు. ఈ సంఘటనపై కూడా కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలను కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మహిళ నేతలపై కాంగ్రెస్ మహిళ నేతలు చేసిన దాడిని ఖండించారు.

అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో మహిళలపై ఆకృత్యాలు భారీగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత 8 నెలల్లో జరిగిన సంఘటనల వివరాలతో కమీషన్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే మరోసారి వచ్చి ఫిర్యాదు చేయాలని కమీషన్ కోరటంతో తప్పకుండా మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తామని అన్నారు. తాను ఇచ్చిన సమాధానంపై కమీషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని చెప్పారు.

ఐతే ఖచ్చితంగా తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ మహిళా నేతలు చేసిన దాడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.

కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మహిళ నేతలు కూడా మీడియాతో మాట్లాడారు. ఒక్క మాట దొర్లినందుకే కేటీఆర్ క్షమాపణ చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నారని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు.

కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళా శాసనసభ్యులను అవమానించటంతో పాటు ఇవ్వాళ తమ పార్టీ నేతలపై దాడి చేయించారని విమర్శించారు. మహిళలపై కేటీఆర్‌కు ఎంతో గౌరవముందని సబితా ఇంద్రారెడ్డి సహా మహిళ నేతలు చెప్పారు. మహిళ శాసనసభ్యులు, మహిళ జర్నలిస్ట్‌లపై దాడుల సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.