mt_logo

తన శాఖలో రేవంత్ జోక్యంపై శ్రీధర్ బాబు అసంతృప్తి! కీలక ఫైల్ వెనక్కి?

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఐటీ, పరిశ్రమల శాఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి జోక్యంపై ఆ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కినుక వహించారట. అందుకే ఇటీవల ఒక కీలక ఫైలును సీఎంవోకే తిప్పి పంపారరన్న వార్తలు ఇప్పుడు సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా షికారు చేస్తున్నాయి.

సౌమ్యుడిగా పేరొందిన శ్రీధర్ బాబు మంత్రి అయ్యాక ఆయన శాఖలో కొన్ని హెచ్ఓడీ పోస్టులకు నియామకాలు ఆయనకు తెలియకుండానే ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయం చేపట్టిందట. ఆయా వ్యక్తుల నియామకం జరిగినట్టు జీవో రిలీజ్ అయ్యాక కానీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆ విషయం తెలియదట. దీంతో కినుక వహించిన శ్రీధర్ బాబు ఇటీవల మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ ఐటీ శాఖలో ఒక కీలక వ్యక్తిని నియమిస్తూ ఫైలు పంపిస్తే, సదరు ఫైలును సంతకం చేయకుండానే వెనక్కు పంపారన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

ఆ ఫైలు ఎవరి నియామకం గురించి అని వాకబు చేస్తే ఐటీ శాఖలో ఒక ఇంగ్లీషు వార్తా పత్రిక ఎడిటర్‌కు కీలక పదవి ఇవ్వడానికి సంబంధించిన ఫైల్ అని తెలిసింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డికి మీడియా సలహాదారుగా ఉన్న సదరు వ్యక్తి.. ఇటీవల అమెరికా పర్యటనలో కూడా పాల్గొన్నాడు. జనవరిలో జరిగిన దావోస్ మీటింగులకు ఆ ఎడిటర్‌ను తీసుకువెళ్లాలనే రేవంత్ నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.

మొత్తానికి తన సన్నిహితుడైన ఆ ఎడిటర్‌కు పదవి కట్టబెట్టాలనే రేవంత్ ఆలోచనకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టే అనిపిస్తోంది.