mt_logo

శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని.. దశాబ్దం గడిచిన సందర్భమిది. ఆధునిక భారతం కళ్లరా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం అని పేర్కొన్నారు.

బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిది. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది. సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిది అని అన్నారు.

60 ఏళ్ల విధ్వంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణది. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే… మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా… అనితర సాధ్యంగా సాగింది ఈ దశాబ్ద ప్రయాణం అని కొనియాడారు.

శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ. నాడు కరవు, రాళ్లురప్పాల, కల్లోలిత తెలంగాణ.. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ.. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని.. తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని.. కాంక్షిస్తూ…ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సావ శుభాకాంక్షలు అని కేటిఆర్ తెలిపారు.