mt_logo

బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్

లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొని తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషి వ్యవహారం కాదని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబద్ధతతో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వెంట నడిచి, ఎన్నికల్లో ప్రజామోదం కోసం కొట్లాడిన తీరు అద్భుతం అన్నారు. 

గత ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో పార్టీ కోసం పని చేసిన, ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ సోషల్ మీడియా వారియర్లకు, కార్యకర్తలకు ఇతర పార్టీల మాదిరి ఏలాంటి చెల్లింపులు చేయకుండా పార్టీ మీద తెలంగాణ మీద ప్రేమతో పనిచేశారని కొనియాడారు.

కేవలం తెలంగాణ మీద ఉన్న ప్రేమ కేసీఆర్ గారి పైన ఉన్న అచంచలమైన విశ్వాసంతో తమ పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తమ వాణిని బలంగా వినిపించి, అద్భుతంగా కొట్లాడారన్నారు. తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో పాటు తమ వెంట నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.