mt_logo

కేంద్రాన్ని నిలదీసే దమ్మూ, ధైర్యం కేసీఆర్ లో ఉన్నాయి..

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకు పోవాలని, లోక్ సభ ఎన్నికల్లో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం మెడలు వంచి సాధించుకోవచ్చని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో టీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. కౌరవులు వందమంది ఉన్నా ఐదుగురున్న పాండవులకే విజయం సిద్ధించింది. కేంద్రాన్ని నిలదీసే దమ్మూ, ధైర్యం సీఎం కేసీఆర్ లో ఉన్నాయన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో 16 ఎంపీ స్థానాలను గెలిపించి పెడితే ఏమి సాధిస్తారో భవిష్యత్తులో మీకే తెలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీకి, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభం. అదే టీఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ గడ్డకు, మన బిడ్డలకు ప్రయోజనం చేకూరుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణకు జాతీయ రహదారులు, రైలు మార్గాలు, కాళేస్వరానికి జాతీయహోదా రావాలంటే పార్లమెంటులో గులాబీ సైనికులు ఉండాలని, వారిని గెలిపిస్తే కొట్లాడి ఎక్కువ నిధులు తెస్తారని, పేగులు తెగే దాకా పోరాడే దమ్ము టీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఉందని కేటీఆర్ తేల్చిచెప్పారు. 70 ఏండ్ల చరిత్రలో రైతులు, బీడీ కార్మికుల గురించి ఎవరన్నా ఆలోచించారా? ఎకరాకు రూ. 5వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ. 10వేలు ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు. నాలుగు నెలల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులకు కాళేశ్వరం, రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తనను సిరిసిల్ల ఎమ్మెల్యేగా 89 వేల మెజార్టీతో గెలిపించారని, వినోద్ కుమార్ కు సిరిసిల్లలో లక్ష మెజార్టీ ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే వినోద్ కుమార్ గెలిస్తే కేవలం కరీంనగర్ ప్రాంతమే కాకుండా రాష్ట్రమంతటికీ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పారు. గజ్వేల్ నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్ వరకు రైలు రావాలంటే పార్లమెంటులో వినోద్ కుమార్ ఉండి కేంద్రం మెడలు వంచాలన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని పాలించే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేదని, రైతులు, పేదల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి, రైతు భీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశానికి దిక్సూచిలా కేసీఆర్ నిలిచారని వినోద్ కుమార్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, తదితర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *