ఢిల్లీలో యాచించడం కాదు.. శాసించి రాష్ట్రానికి కావలసిన నిధులు తెచ్చుకుందామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్నారు. ఆదివారం చేవెళ్ళ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా చేవెళ్ళ, పరిగిలో నిర్వహించిన రోడ్ షోలలో కేటీఆర్ పాల్గొని భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16మంది ఎంపీలను గెలిపిస్తే ఏవైనా సాధించవచ్చని, దేశాన్ని 71 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదని, ఇప్పటికీ కరెంట్ లేని ఊళ్లు, రోడ్లు లేని గ్రామాలు అనేకం ఉన్నాయన్నారు. చేవెళ్లలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పటికీ కేటీఆర్ ప్రసంగాన్ని భారీగా హాజరైన ప్రజలు ఆద్యంతం విన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీకి, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభమని, అదే టీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభమని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వచ్చిన ప్రధాని మోడీ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటిస్తారని ప్రజలు ఆశించారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై విమర్శలు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు.
16 మంది ఎంపీలు ఉంటే ఏం చేస్తారంటున్నారని, ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్.. అదే 16 మంది ఎంపీలు ఉంటే ఏం చేస్తారో ఆలోచించండని కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఒకవైపు కేసులు వేస్తూ, మరోవైపు ర్యాలీలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, 25 రాష్ట్రాల్లో అడ్రస్ లేని పరిస్థితి ఉందని, ఆ పార్టీకి 80 నుండి 90 సీట్లే వస్తాయని చెప్పారు. కృష్ణా నీటితో పరిగి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని, చేవెళ్ళ నియోజకవర్గంలోని 84 గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా ఉన్న 111 జీవోను పర్యావరణం, చెరువులకు నష్టం లేకుండా ఎత్తివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ జీవో ఎత్తివేతతో చేవెళ్ళ ప్రాంతం ఐటీ పరిశ్రమలతో ఐటీ హబ్ గా మారుతుందన్నారు.
ఐదేళ్ళ క్రితం చేవెళ్ళ నుండి పోటీ చేసిన వ్యక్తి ఎవరో ఇక్కడి ప్రజలకు పరిచయం లేదని, అయినప్పటికీ కేసీఆర్ పంపించిన అభ్యర్థి అంటూ ప్రజలంతా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించారని కేటీఆర్ అన్నారు. కారణాలు ఏవైనా ఆయన పార్టీ వదిలిపెట్టిపోయారు.. మనకేం బాధ లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్య కాదు.. కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ కు, రైతుల సంక్షేమానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న టీఆర్ఎస్ కు మధ్య అని కేటీఆర్ పేర్కొన్నారు. మంచిపనులు చేస్తున్న కేసీఆర్ కు ఓటేస్తారా? లేక దగుల్బాజీ పనులు చేస్తూ సాగునీరు రాకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ కు ఓటేస్తారా? ఆలోచించండని, చేవెళ్ళ టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.