చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రెండువారాల కింద ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించగా..ఇది రెండవ సమీక్ష. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చిన పలు అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుటుంది అన్న మంత్రి, వివిధ పథకాల కింద చేనేత సంఘాలకు, కార్మికులకు రూ. 73.5కోట్ల రూపాయల నిధిని విడుదల చేశారు.
చేనేత సహకార సంఘాలకు 20% హాంక్ నూలు, రంగులకు సబ్సిడీ పధకము క్రింద నిధులు, పావలా వడ్డీ పధకము, మార్కెటింగ్ ప్రోత్సాహక పధకము, టెస్కో ఎక్స్ గ్రేషియా చెల్లింపులు, చేనేతమిత్ర పథకం ద్వారా నిధులు, క్యాష్ క్రెడిట్ రుణాల చెల్లింపు, చేనేత కార్మికులకు మరియు అనుబంధ కార్మికులకు త్రిప్టు ఫండ్ పధకము పునఃప్రారంభించుట వంటి అంశాల పైన సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత జౌళి శాఖ అధికారులతో పధకాల వారీగా చర్చించి, ఇందుకు సంబంధించి సుమారు రూ. 73.5 కోట్ల రూపాయల నిధులను మంగళవారం విడుదల చేయడం జరిగింది. ఈ పథకాల వల్ల చేనేత కార్మికుల తలసరి ఆదాయాలు వృద్ధి చెందడమే కాకుండా రాష్ట్రములోని అన్ని చేనేత సహకార సంఘాలు పరిపుష్టిగా రూపొంది చేనేత కార్మికులకు 365 దినాలు సంపూర్ణముగా పని కల్పించుటకు మార్గం సుగమమవుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు చేనేత కార్మికుల యొక్క నెలసరి ఆదాయాలు కనీసం రూ.15000/- మించి పొందడానికి ఆస్కారం ఏర్పడిందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.