ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడమేంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించడంపై కేటీఆర్ మండిపడ్డారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై.. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం? ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి? అని ప్రశ్నించారు.
గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్త్తోంది.. సంప్రదాయాలను మంటగలుపుతోంది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అని దుయ్యబట్టారు.
పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా? దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం? రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా? అని కేటీఆర్ ఆక్షేపించారు.