బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి తొలుత ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలంటూ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేసిన పిటీషన్‌పై ఇవ్వాళ సంచలన తీర్పు వెలువడింది. స్పీకర్ ఈ అనర్హత పిటీషన్ల మీద నాలుగు వారాల్లో తగిన చర్య తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవిధంగా ఇది రేవంత్ రెడ్డికి తగిలిన తొలి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ తీర్పు రేవంత్ ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ముందుగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడటం దాదాపుగా ఖాయం అయ్యింది. వెంటనే ఈ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం కూడా ఖాయం. తొమ్మిది నెలల్లోనే అన్నివర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఉప ఎన్నికలు పెద్ద గండమనే చెప్పాలి.
దానికి తోడు ఈ మూడు స్థానాల్లో తాము ఓటువేసి గెలిపించిన ఎమ్మెల్యేలు నెలల్లోపే వేరే పార్టీకి మారారు అన్న కోపం ప్రజల్లో ఉంది. అందువల్లనే ఆ మూడు చోట్ల ఇప్పుడున్న సిటింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అదే కనుక జరిగితే సరైన సమయం కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్ అసమ్మతి నేతలు రేవంత్ మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం ఖాయం.
హైకోర్టు తీర్పుతో ఇప్పటికే పార్టీ మారిన కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడ్డారు అనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగతా ఎమ్మెల్యేల మీద కూడా ఇదేవిధమైన తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉండటంతో ఇప్పటికే పార్టీ మారిన వారి గుండెల్లో గుబులు మొదలైందట.
చేరినోళ్ళ పరిస్థితే అగమ్యగోచరంగా మారడంతో, ఇక కొత్తగా బీఆర్ఎస్ వీడే సాహసం ఏ ఎమ్మెల్యే కూడా చేయరు అని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అసలే అత్తెసరు మెజారిటీ ఉంది. జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారిపోయే పరిస్థితి, మొన్న హైడ్రా ఓవర్ యాక్షన్‌తో దూరమైన మజ్లీస్ పార్టీ. ఇంకోవైపు కాంగ్రెస్‌లో బుసలు కొడుతున్న అసమ్మతి. వెరసి రేవంత్ సర్కారుకు గడ్డు కాలం మొదలైందనే చెప్పాలి.