తెలంగాణ అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరారు. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
శాసనసభ సాక్షిగా శాసనసభ్యులను, తెలంగాణ ప్రజలను ప్రభుత్వ రుణాలపైన తప్పుదోవ పట్టించారు. అందుకే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంలోనూ సభ హక్కుల నోటీసు ఇచ్చాం అని తెలిపారు.
లగచర్ల వంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు, టూరిజంపైన అసెంబ్లీలో చర్చ పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అద్దంపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లగచర్ల అంశంలో శాసనసభలో చర్చించాలని స్పీకర్‌కి విజ్ఞప్తి చేశాం అని అన్నారు.
ఆరు లక్షల 71 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 3 లక్షల 89 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అసలైన అప్పులతో సవరణ స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇవ్వాలి. లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని సభను ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేశారు.
గతంలో నేనే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌ను స్పీకర్ మనోహర్ గారు అంగీకరించారు. ఆ సందర్భంగా సభలో చర్చ కూడా జరిగింది. గతంలో ఉన్న పద్ధతులు, సాంప్రదాయాలకు అనుగుణంగా స్పీకర్ గారు ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని స్పీకర్ గారు శాసనసభలో అనుమతిస్తారని ఆశిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపైన బయట కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు అంటూ లేని అప్పు గురించి మాట్లాడుతున్నారు. వీళ్లు చెబుతున్న అప్పుల లెక్కలు తప్పు కాబట్టి ఈ ప్రభుత్వం కడుతున్నామని చెప్తున్న నెలకు రూ. 6,500 కోట్ల వడ్డీ లెక్కలు కూడా తప్పే. రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది కేవలం ఎడాదికి రూ. 22,000 కోట్ల వడ్డీ మాత్రమే అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజంపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ స్వీకరించడం బాధాకరం. రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీకి వందకు పైగా చేసిన పర్యటనలతో ఢిల్లీ టూరిజం బాగా పెరిగిందన్నారు.
మరోవైపు 40 మంది లగచర్లరైతులను జైలులో పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మొదలుకొని పార్టీ నాయకులను జైల్లో పెడుతున్న జైలు టూరిజం.. బెయిల్ వచ్చిన తర్వాత కూడా నటులను జైలులో ఉంచుతున్న జైలు టూరిజం.. ప్రభుత్వ పథకాలపైన మాట్లాడుతుంటే జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి చేస్తున్న జైలు టూరిజం.. ఈ విధంగా తెలంగాణలో జైలు టూరిజం బాగా నడుస్తుంది అని ఎద్దేవా చేశారు.
సర్పంచుల సమస్యలను కూడా శాసనసభలో లేవనెత్తినం అని కేటీఆర్ అన్నారు. వారికి ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్ల రూపాయలు గత నెలలు ఇచ్చిన నిధుల్లో సగం ఇస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేసాము. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని స్పీకర్‌కు కూడా విజ్ఞప్తి చేశాము అని కేటీఆర్ తెలిపారు.
శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్‌ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. స్పీకర్ సొంత జిల్లా వికారాబాద్‌లో జరిగిన ఈ సంఘటనపైన చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరించాలని స్పీకర్‌కి విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రైతులను అక్రమంగా జైల్లో ఉంచిన తీరుపై రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని శాసనసభలో తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు
ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను, శాసనసభ వైపు రాకుండా చేసిన తీరుపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి అందరూ మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటున్నదని కేటీఆర్ అన్నారు.
అయితే గతంలో ఇదే శాసనసభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాల వంటి వాటితో పాటు అనేక రకాల అంశాలను తీసుకువచ్చి నిరసన తెలిపిన అంశాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం శాసనసభలో మమ్మల్ని కట్టడి చేసి ప్రభుత్వ వైఫల్యాలను దాచుకోవాలని చూస్తుందని కేటీఆర్ అన్నారు.
శాసనసభ్యులను మీడియా వద్ద మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్న తీరుపైన కూడా కేటీఆర్ మాట్లాడారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు పలువురు శాసనసభ్యులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తే కాసేపు ఆపాలని.. రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వచ్చిన అంశంపైన మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను దాచి పెట్టేందుకే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుందన్నారు.
రైతు కూలీలకు రూ. 12 వేల అర్ధిక సహాయం అందిస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహరాలకు వ్యతిరేకం అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని బట్టి విక్రమార్క మర్చిపోయారన్నారు. ఈ అంశాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలియజేశారు.
గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన భట్టి, శాసనసభ బయట ప్రకటన చేయడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఈ ప్రకటన చేస్తే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదని, అందుకే బయట ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామమని చెప్తున్న మాటను కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేవుళ్ళపైన ఓట్లు వేసిన విషయానికే దిక్కు లేదని అలాంటిదిప్పుడు సంక్రాంతికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తామంటే రాష్ట్ర ప్రజలు ఎవరికి నమ్మకం లేదన్నారు.