ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దివంగత రామలింగారెడ్డి నిరాడంబర నాయకుడని, ఆయన ఎమ్మెల్యే కాకముందే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని ఊహించలేదని, రామలింగారెడ్డి కుటుంబానికి ఈ సభ ప్రగాఢ సంతాపం తెలుపుతోందని అన్నారు. ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు రామలింగారెడ్డి.. ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉండి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణం దుబ్బాక ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలను కలచివేసిందని అన్నారు.
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామలింగారెడ్డి విద్యార్ధి దశనుండే ప్రజా ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు. జర్నలిస్టుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక రాజీలేని పోరాటాలు చేశారు. తాను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాది.. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కాళోజీ, నా చేతుల మీదుగా రామలింగారెడ్డి వివాహం జరిగింది. రామలింగారెడ్డిలోని నిబద్ధత, విశ్వసనీయత, నాయకత్వ లక్షణాలు గమనించి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టిక్కెట్ ఇచ్చాం. దొమ్మాట నియోజకవర్గం నుండి గెలిచి యువ నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. సమైక్య వాదుల ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమ ప్రయోజనాల కోసం చివరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. షుగర్ వ్యాధితో చికిత్స పొందుతున్న ఆయన ఆగస్ట్ 6 న తుదిశ్వాస విడిచారని సీఎం కేసీఆర్ తీవ్ర మనోవేదనతో చెప్పారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని, కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి అని అన్నారు. రామలింగారెడ్డిది గొప్ప వ్యక్తిత్వమని, నిరాడంబరమైన జీవన విధానంతో ఉండేవారన్నారు. 2004 లో దొమ్మాట నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు రామలింగారెడ్డి అయితేనే న్యాయం చేస్తారని భావించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావించారని, ఎంతోమంది టిక్కెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ పట్టుబట్టి రామలింగారెడ్డికే పార్టీ టిక్కెట్ ఇచ్చారని గుర్తుచేశారు.