శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. రేపు ఉదయం గం.11లకు ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించి నివాళులు అర్పించారు. వీరితో పాటు మాజీ శాసన సభ్యులు సున్నం రాజయ్య, జువ్వాడి రత్నాకర్ రావు, పోచయ్య, పీ. రామస్వామి, మాతంగి నర్సయ్య, మస్కు నర్సింహ, బీ. కృష్ణ, ఎడ్మ కృష్ణారెడ్డి, కావేటి సమ్మయ్య తదితరుల మృతి పట్ల సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశాలకు సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ సెక్రెటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ నిర్వహణ, ఎజెండాపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలను 20 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే..