లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మల్కాజిగిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రోడ్ షోలకు ప్రజలనుండి భారీ స్పందన వచ్చింది. అన్నీ తానై గత నెల 30 నుండి సోమవారం వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉప్పల్, కంటోన్మెంట్, మహేశ్వరం, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, చేవెళ్ళ, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్, పరిగి, వికారాబాద్, ఖైరతాబాద్, అంబర్ పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కేటీఆర్ చేపట్టిన రోడ్ షోలకు జనం వెల్లువలా తరలివచ్చారు. ఎటు చూసినా జనప్రభంజనమే! పాదయాత్రలు, బైక్ ర్యాలీల ద్వారా సభకు చేరుకొని బ్రహ్మరథం పట్టారు. ప్రతిచోటా రోడ్ షోలు విజయోత్సవ సభలను తలపించాయి. ప్రధానంగా కేటీఆర్ ఆయా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి గురించి అత్యంత విపులంగా వివరిస్తూ సభకు వచ్చిన ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నారు.
71 ఏండ్ల పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిన మోసాలు, అవినీతిని ఎండగట్టారు. పదహారు ఎంపీ సీట్లను టీఆర్ఎస్ కు కట్టబెడితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మంచి పాలన అందించిన సీఎం కేసీఆర్ వైపు దేశమంతా చూస్తున్నదని, బీజేపీ, కాంగ్రెస్ తో అభివృద్ధి సాధ్యం కాదని, ఇకపై యాచించకుండా ఢిల్లీని శాసిద్దామంటూ అద్భుతమైన ప్రసంగం చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. కేటీఆర్ రోడ్ షోలతో అభ్యర్ధుల్లోనూ మెజార్టీ గెలుపుపై ధీమా రెట్టింపు అయింది. రోడ్ షో విజయవంతం కావడంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, యువజన విభాగం నేతలు పాటిమీది జగన్మోహన్ రావు, సతీష్ రెడ్డి తదితరులు కీలకపాత్ర పోషించారు.