ఏప్రిల్ 11న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. సోమవారం వికారాబాద్ లో చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ కు కొన్ని సమస్యలున్నాయి. ఖచ్చితంగా వికారాబాద్ లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత నాది. 111 జీవోతో ఇబ్బంది పడే 84 గ్రామాల అన్నదమ్ములకు చెప్తున్న. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. చేవెళ్ళ నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజార్టీతో రంజిత్ రెడ్డిని గెలిపించండి. మీరెంత మెజార్టీ ఇస్తరో.. అంత తొందరగా నేను జీవో 111 ఎత్తేస్త.. రంజిత్ రెడ్డి నాయకత్వంలో ఆ జీవోను రద్దు చేసుకోవాలని కేసీఆర్ అన్నారు.
వికారాబాద్ కు త్వరలో మిషన్ భగీరథ నుండి తాగునీరు వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఎత్తేయగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతాం. రైతులు లంచాలిచ్చే బాధలు పోవాలె. రెండు నెలలు ఓపిక పట్టండి. వంద శాతం జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తెస్తం. పూర్తి యాజమాన్య బాధ్యత.. కంక్లూజివ్ టైటిల్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. పదహారు ఎంపీ సీట్లు గెలిస్తేనే దేశానికి మంచి దశ.. దిశ.. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కాంగ్రెస్, బీజేపీలు కలిసినా సంపూర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు. కాబట్టి ప్రాంతీయ పార్టీలదే హవా.. మనది కొత్త రాష్ట్రం.. మనకు ఒక జాతీయ ప్రాజెక్టు రావాలె.. మన హక్కులు నెరవేరాలంటే ఢిల్లీలో మన పాత్ర కీలకంగా ఉండాలి. అందుకే 16కు 16 ఎంపీలను గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.
రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. మే నెల నుండి పెన్షన్లు రూ. 2,000 ఇస్తం. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ రూ. 3,000 ఇస్తం. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడ్తున్నం. మనకు కులం లేదు. మతం లేదు. అన్ని వర్గాల ప్రజలు మంచిగా బతకాలి. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చాలా పెద్ద ఉద్యమకారుడు. 2001 నుండే టీఆర్ఎస్ కు అండదండగా ఉంటూ వస్తున్న వ్యక్తి. ఆయన ఏనాడూ పదవి అడగలేదు. ఈసారి పార్లమెంట్ కు పోయి చేవెళ్ళ నియోజకవర్గానికి సేవ చేస్తా అని అంటే ఇక్కడినుండి పోటీ చేయిస్తున్నం. మీకు, చేవెళ్ళ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతడు. మీ సేవలో ఉంటడు. కారు గుర్తుకు ఓటువేసి రంజిత రెడ్డిని గెలిపించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.