mt_logo

ఎస్ఆర్‌డీపీ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యంపై కేటీఆర్ మండిపాటు

ఎస్ఆర్డీపీ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం SRDP (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) పేరుతో మంచి కార్యక్రమాన్ని తీసుకుంది అని తెలిపారు.

దీని కింద 42 కొత్త ప్రాజెక్టులను పూర్తిచేయాలని సంకల్పించింది. ఇందులో 36 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది అని విమర్శించారు.

ప్రాజెక్టు పనులన్ని నత్తనడకన సాగుతున్నాయి. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేదు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా SRDP మూడో దశను ప్రారంభించాలి. మూడో దశకు సంబంధించిన ప్రణాళికలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది అని గుర్తు చేశారు.

మూడో దశలో మూసీకి ఇరు వైపుల ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు వంటి పనులు ఉన్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచటంతో పాటు నగరాభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.