mt_logo

వరద బాధితులకు కేవలం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అన్యాయం: కేటీఆర్

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలి. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు అని గుర్తు చేశారు.

ఇప్పుడు అధికారంలో ఉన్నారు.. మీరిచ్చిన మాటను నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించండి. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరముంది అని అన్నారు.

వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదు ముఖ్యమంత్రి గారు.. అదే విధంగా వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సాయం చేస్తామన్నారు.. ఆ హామీని కూడా నేరవేర్చండి అని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవటం కారణంగానే ప్రాణనష్టం జరిగింది. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించండి అని కేటీఆర్ సూచించారు.