mt_logo

ప్రజా పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ: కేటీఆర్

ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు.

1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహా నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య పోరాటం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన సుధీర్ఘ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసంలోనే పురుడు పోసుకుంది అని గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని సమున్నతంగా గౌరవించింది. ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహం ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టింది అని తెలిపారు.

తెలంగాణ పోరాటంలో, తొమ్మిదిన్నరేళ్ళ తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన స్ఫూర్తి ఇమిడివుంది అని కేటీఆర్ అన్నారు.