mt_logo

తెలంగాణ సోయి కలిగిన ప్రతి ఒక్కరికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శనీయం: కేసీఆర్

స్వాతంత్ర్య సమరయోధుడుగా, అనంతర కాలంలో తెలంగాణ స్వయంపాలన కోసం ఆత్మగౌరవం కోసం, పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

రాజకీయవేత్తగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు తెలంగాణ సోయి కలిగిన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కేసీఆర్ కొనియాడారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని (సెప్టెంబర్ 27) పురస్కరించుకుని వారి కృషిని కేసీఆర్  స్మరించుకున్నారు.

మంత్రి పదవిని త్యాగం చేసి నాటి తెలంగాణ వ్యతిరేకులకు సవాల్ విసిరిన బాపూజీ పట్టుదల తన మలిదశ రాష్ట్ర సాధన పోరాటంలో స్ఫూర్తి నింపిందని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులు కాపాడబడాలంటే స్వరాష్ట్ర సాధనతోనే సాధ్యమని, తాను రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ తనకు అండగా నిలిచిన సందర్భాన్ని కేసీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

స్వయంపాలన కోసం తాను తొలి అడుగు వేసిన నాటి జలదృశ్యం ఉద్యమ ప్రస్థానం నుంచి, స్వరాష్ట్రంగా నిలిపి పదేండ్ల బీఆర్ఎస్ పాలన సాధించిన ప్రగతి ప్రస్థానం ఒక చరిత్రాత్మక ఘట్టం అని కేసీఆర్ అన్నారు.

బడుగు బలహీన వర్గాల అభున్నతే లక్ష్యంగా తన జీవితకాలం పోరాడిన బాపూజీ ఆకాంక్షలకు అనుగుణనంగా పదేండ్ల పాలన కొనసాగిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

బాపూజీ కృషిని భావి తరాలకు నిత్య స్పూర్తిగా నిలిపేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి స్మారకార్థం అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. 

తెలంగాణ సబ్బండ కులాల ఆత్మగౌరవాన్ని కాపాడడం, అన్ని రంగాల్లో వారి హక్కులకు రక్షణ కల్పించడం, వారిని స్వయంపాలనలో భాగస్వామ్యులను చేయడం ద్వారానే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.