రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఒరాకిల్ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమై ఐటీ పెట్టుబడులు, మౌలిక వసతులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలుపుతామని, తెలంగాణను దేశంలోనే టాప్–5 గా నిలుపుతామని అన్నారు. ఈనెల 27న హోటల్ తాజ్ బంజారాలో 150 ఐటీ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే ఐదేళ్ళలో 15 ఏళ్లకు సరిపడా టెక్నాలజీని సమకూరుస్తామని, ఈ-పంచాయితీ, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్ సేవలను మెరుగు పరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో అర్హత లేనివారికి కూడా కార్డులు, పెన్షన్లు అందుతున్నాయని, వీటిపై సరైన చర్యలు తీసుకుంటామని, ఐటీఐఆర్ కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.