కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యుడైన భట్టి విక్రమార్క నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వలేదు. హైదరాబాద్ అభివృద్ధి తామే చేశామని ఊకదంపుడు ఉనపన్యాసం చెప్పారు. కొత్త విషయం చెప్పలేదు. తెలంగాణ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలకు పట్టదు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ వాళ్ళకు కడుపు మండుతుంది. హైదరాబాద్ బెస్ట్ సిటీ అని అనేక సర్వేలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే డైనమిక్ సిటీ అని జేఎల్ఎల్ చెప్తుంటే వీళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే 2014, 2018 ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయారు? కోటి మంది ఉండే హైదరాబాద్ లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. పేదల గురించి ఆలోచించలేదు. బస్తీ దవాఖానలు, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించలేదు. కరెంట్ కోసం ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామిక వేత్తలు ధర్నా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. ఆరు కోట్ల మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్లు నగరంలో ప్రతి మూలన కనిపిస్తాయి. గాంధీ భవన్ లో కూర్చుంటే కనిపిస్తుందా? తెలంగాణ వచ్చిన తర్వాత గాంధీ భవన్ దివాళా తీసింది. రేపోమాపో టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. రూ. 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నాం. వీటిలో రూ. 9,714 కోట్లతో హైదరాబాద్ లో ఇండ్ల నిర్మాణం చేస్తున్నాం. మొత్తం లక్ష ఇండ్లు డిసెంబర్ వరకు పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ఎంత ఖర్చు పెట్టింది? 2014 నుండి 2020 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెల్సుకోవాలి. హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ. 67 వేల 130 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలానికి కేవలం రూ. 4,636 కోట్లు ఖర్చు పెట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు.