mt_logo

పాలన పక్కన పెట్టి కేసీఆర్, బీఆర్ఎస్‌ని దూషించటమే రేవంత్ పని: కేటీఆర్

మొత్తం పాలన పక్కన పెట్టి కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని దూషించటమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారు. ఈ రాష్ట్రంలో అసలు పాలనే లేదు. చరిత్ర తెలియని కొంతమంది సెప్టెంబర్ 17ను రాజకీయాల కోసం వక్రీకరించారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి.. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు  చరిత్ర తెలియని కొంతమంది సెప్టెంబర్ 17 ను రాజకీయాల కోసం వక్రీకరించారు. తెలంగాణలో గంగా జమున తెహజీబ్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు గత పదేళ్లలో ఒక్క నొక్కు పడకుండా శాంతి భద్రతలను కాపాడారు అని అన్నారు..

నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన పనికి మాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది.  నోరు ఉంది కదా అని కేసీఆర్ గారిని దూషించటమే పనిగా పెట్టుకొని 9 నెలలు టైమ్‌పాస్ చేశారు. చేతనైతే మీరు ఇచ్చిన 420 అడ్డగోలు హామీలను అమలు చేసి చూపెట్టండి అని సవాల్ విసిరారు.

చేతనైతే మా మాదిరిగా కరెంట్, రైతుబంధు ఇవ్వండి. కేసీఆర్ పది వేలే ఇస్తా అన్నాడు. నేను 15 వేలు ఇస్తా అని డైలాగులు కొట్టుడు కాదు. ఇంకా 14 రోజులు మాత్రమే ఉంది. చేతనైతే రైతు భరోసా ఇవ్వు. చేతనైతే మహిళలకు ఇచ్చిన హామీలు నేరవేర్చు. చైతనైతే అవ్వ, తాతలకు ఇస్తానన్న రూ. 4 వేల ఫించన్లు ఇవ్వు. చేతనైతే నిరుద్యోగులకు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు అని అన్నారు.

హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ఆంధ్రజ్యోతి, ఈనాడులో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాశారు. చేతనైతే హైదరాబాద్‌లో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా. పోలీస్ బండ్లలో బిల్లులు కట్టలేదంటూ పెట్రోల్ పోస్తలేరు. స్కూళ్లలో చాక్‌పీస్‌లు లేని పరిస్థితి. మాజీ సర్పంచ్‌ల బిల్లుల కోసం బాధపడుతున్నారు అని దుయ్యబట్టారు. 

నిన్న ఈయన కేసీఆర్ పై నోరు పారేసుకుంటుంటే అందరూ నవ్వుకుంటున్నారు. అందరి తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెడదామంటే.. లేదు లేదు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడదామని పెట్టాడు. ఇన్ని రోజులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని తిట్టాడు కదా దాన్ని కవర్ చేసుకోవటానికి ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు అని విమర్శించారు.

రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండంట. ఈ ముఖ్యమంత్రి తెలివి అట్ల ఉంది. ఈయనకు ఏమీ తెల్వదు. ఈయనకు తెల్వదన్న విషయం కూడా తెల్వదు. ఇది ఆయన పరిస్థితి. రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబ్బెజ్ కంప్యూటర్ కనిపెట్టాడు. కంప్యూటర్‌ను ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదు. 1955 లో టాటా గ్రూప్ వాళ్లు కంప్యూటర్ పరిచయం చేశారు అని కేటీఆర్ అన్నారు.

ఇక రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసింది. చికెన్ గున్యాలు, విష జ్వరాలు, డెంగీలతో జనం బాధపడుతున్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని పక్కన పెట్టారు. కనీసం పల్లెల్లో పిచికారికి కూడా పైసల్లేవ్. పెట్రోల్‌కు, చాక్‌పీస్‌లకు, జీతాలకు కూడా పైసల్లేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి వచ్చింది. అంత దారుణంగా జనం జర్వాలతో అతలాకుతలమవుతున్నారు. మొత్తం పాలన పక్కన పెట్టి కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని  దూషించటమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17 ను ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారు. ఈ రాష్ట్రంలో అసలు పాలనే లేదు అని ఎద్దేవా చేశారు.

గురుకులాల్లో పిల్లల మీద ఆఘాయిత్యాలు జరుగుతున్నాయి. గురుకుల టీచర్లను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో ఆలనా పాలన లేని పరిస్థితి ఉంటే.. రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టండి. ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా మీ వెంట పడుతాం. మీ అంతు చూస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ తల్లి ఆత్మను అవమానించావు. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాం పెట్టావ్..మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తాం. నీకు అంత ఇష్టమైతే జూబ్లీహిల్స్‌లో మీ ఇంట్లో పెట్టుకో. గణేష్ నిమజ్జనం రోజు చెబుతున్నా రాసి పెట్టుకో.. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ప్రకటించారు. 

అదే విధంగా మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. వాళ్లు ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేస్తేమంటే అడ్డుకుంటారా? పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకొని అరెస్ట్ చేసిన మా విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జనానికి సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాగానికి అభినందనలు అని తెలిపారు.