దీక్షా దివస్ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్ పుస్తక ప్రదర్శనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంస్కృతిపరంగా, భాషపరంగా తెలంగాణ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కొంత మేరకు చేసుకున్నాం. విజయవంతం అయ్యాం. ఒక బతుకమ్మ పండుగగానీ, బోనాల పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నాం అని గుర్తుచేశారు.
తెలంగాణ భాష, యాస ఔన్నత్యాన్ని సిలబస్‌లో పెట్టుకున్నాం మహానీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశాం. అదే మాదిరిగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు గొప్ప నాయకుల పేర్లు పెట్టాం. ఉదాహరణకు ప్రొ. జయశంకర్ సార్ పేరు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం.. పీవీ నర్సింహ రావు పేరును వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం.. కాళోజీ పేరును హెల్త్ యూనివర్శిటీకి పెట్టుకున్నాం.. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును హర్టీకల్చర్ యూనివర్శిటీకి పెట్టుకున్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాం.. జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి జిల్లాకు పెట్టాం. కొత్త చరిత్రను వెలుగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం చేశాం అని తెలిపారు.
తెలంగాణ పోరాటంలోనే సంస్కృతి కూడా ఒక భాగం కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేశాం. ప్రపంచ తెలుగు మహాసభలు రెండోసారి కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించాం.. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా మూడు రోజులుపాటు ఘనంగా నిర్వహించాం. ఎంతోమంది కళాకారులు, కవులను సత్కరించి గౌరవించుకున్నాం అని అన్నారు.
సాంస్కృతిక సారధి పెట్టి.. ఆ సారథికి ధూంధాం వ్యవస్థాపకుడిగా ఉన్న రసమయి బాలకిషన్‌ను చైర్మన్‌గా నియమించాం.బాలకిషన్‌కు క్యాబినెట్ హోదా ఇచ్చి అందులో దాదాపు 500 మంది కవులు, కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చాం. తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకుపోయేలా వారిని గౌరవించాం. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే అయా ప్రాజెక్టులకు ఆ ప్రాంతంలో ఉండే దేవుళ్లు పేరు పెట్టుకున్నాం. కొండపోచమ్మసాగరని పెట్టుకున్నాం.. కొమరవెళ్లి అని, రంగనాయకసాగర్, రాజరాజేశ్వర సాగర్, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క సారక్క బ్యారేజ్, లక్ష్మి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్ అని దేవుళ్ల పేర్లు పెట్టుకున్నాం అని పేర్కొన్నారు.
ఏనాడూ కూడా మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు.. ఈ ప్రాంతం శాశ్వతం అనేది మా భావన. కేసీఆర్ నేర్పన సిద్ధాంతం ఒక్కటే.. అధికారం శాశ్వతం కాదు తెలంగాణ శాశ్వతం, తెలంగాణ చరిత్ర శాశ్వతం. తెలంగాణ గొప్పతనం శాశ్వతంగా నిలవాలన్న ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశాం. ఏన్నడూ కేసీఆర్ పేరు పెట్టి కార్యక్రమాలు చేయాలని అనుకోలేదు. కేసీఆర్‌కు ఇష్టం లేకున్న మేమే బలవంతంగా కేసీఆర్ కిట్ అని పెట్టాం. కేసీఆర్ కీర్తి కోసం ఎనాడూ ఆలోచన చేయలేదు అని అన్నారు
కాళోజీ కళాక్షేత్రమని వరంగల్‌లో పెట్టినా దాని తదుపరి ఇతర జిల్లాల్లో కూడా కళాభారతి పేర భవనాలు నిర్మించాం. నల్లగొండ, నిజామాబాద్‌లో కవులు, రచయితలకు పెద్దపీట వేయాలనే ప్రయత్నం కేసీఆర్ చాలా బలంగా చేశారు. గ్రంధాలయ అధ్యక్షుడిగా శ్రీధర్ చాలా ప్రయత్నం చేశారు.. అనేకంగా కొత్త గ్రంథాలయాలను ప్రారంభించుకున్నాం.. జరగాల్సినంత జరుగలేదు.. ఇంకా జరగాల్సి ఉండే. తెలంగాణ సమాజంలో ఉన్న అభిప్రాయాలను ముందుకు తీసుకుపోతాం అని కేటీఆర్ తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి దీక్షా దివస్ (నవంబర్29) నుంచి మొదలు విజయ్ దివస్ (డిసెంబర్ 9) వరకు 11 రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తం. కార్యక్రమాల కోసం పార్టీ తరపున డెడికేటెడ్ కమిటీలను నియమించుకుంటాం. రచయితలు, సాహితీవేత్తలు ఒకవైపు, కవులు, కళాకారులతో కూడిన బృందాలను నియమిస్తాం. తెలంగాణ లిటరేచర్ డే, ఫెస్టివల్ 11 రోజుల సందర్భంగా హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా నిర్వహిస్తం.. సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలు చేస్తం అని అన్నారు.
సింహాలు చరిత్రను చెప్పుకోకుంటే.. వేటగాళ్లు చెప్పేవే చరిత్రగా నిలిచిపోయేయ ప్రమాదం. యుద్ధంలో గెలిచినవాడే పరాజితుని గాథ చెరిపేస్తామడనే భావన.. ఇవాళ తెలంగాణ జరుగుతుంది అదే. కేసీఆర్ మీద ఉన్న కోపంతో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఎన్టీఆర్ ట్యాంక్ బండ్‌పై పెట్టిన విగ్రహల గురించి రేవంత్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ మహోన్నతంగా మాట్లాడిన అంబేద్కర్ విగ్రహం గురించి సీఎం మాట్లాడడు. అంబేద్కర్ పేరుతో కట్టిన శ్వేతసౌధం గురించి మాట్లాడడు.. పోలీస్ కమాండర్ కంట్రోల్ గురించి ఒక్క మాట రాదు. ఈ పదేళ్లలో హైదరాబాద్‌లో కట్టిన నిర్మాణాల గురించి మాట రాదు.. కేసీఆర్ మీదున్న కోపంతో మాటల దాడి చేయండి. కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్నే మారిస్తే చరిత్ర క్షమించదు అని వ్యాఖ్యానించారు.
భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం తెలంగాణ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం తలసరి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ. సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి మూర్తీభవించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు.దాశరథి, రావెళ్ల వెంకటరామారరావు ప్రస్తుతించినట్లు మా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్నట్లుగా ప్రతిష్టించారు. ఇక్కడి ప్రజల ఆశయాలు, ఔన్నత్యాన్ని, గొప్పతనానికి చిహ్నంగా ప్రతిష్టించుకున్నాం అని తెలిపారు.
సుసంపన్నమైన తెలంగాణ తల్లిని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్టించాలని సీఎం చూస్తున్నాడు. రూపం మార్చడంతోపాటు కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటున్నాడు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..ఇందిరాగాంధీ ప్రతిష్టించిన భరతమాతను వాజ్‌పేయ్ గారు రాగానే మార్చలేదు. దేశంలో ఎన్నోచోట్ల అధికార మార్పిడి జరిగింది.. తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు.. కన్నడమాత రూపంలో పెట్టుకున్న విగ్రహ రూపం మారలేదు అని కేటీఆర్ అన్నారు.