దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్‌లోని అలుగునూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్. కరీంనగర్‌లో జరిగిన సింహగర్జన ద్వారానే కేసీఆర్ గారు దేశానికి పరిచయమ్యారు అని గుర్తు చేశారు.
ఎక్కడుంది తెలంగాణ అన్నోళ్లకు ఆనాటి లోక్ సభ ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీ ఇచ్చి తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో ఇక్కడి ప్రజలు చూపించారు. 2009లో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నప్పుడు చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. తెలంగాణవాదం ఇక లేదని అన్నారు. కానీ కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ వేదికగా నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో అంటూ గర్జించారు. అలాంటి కరీంనగర్ గడ్డకు, కరీంనగర్ బిడ్డకు వందనం తెలియజేస్తున్నా అని అన్నారు.
కరీంనగర్ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుంటే తెలంగాణ సిద్ధించేదో లేదో తెలియదు. కేసీఆర్ గారు ఆమరణ దీక్షా చేపట్టి 15 ఏళ్లు గడిచిన సందర్భంగా ఇవ్వాళ మనం ఎటు పోవాలో తెలుసుకోవాలంటే.. ఎక్కడ ప్రారంభమయ్యామో తెలుసుకోవాలని కేసీఆర్ నిత్యం చెబుతుంటారు అని తెలిపారు.
అప్పట్లో 8 ఏళ్లు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్రాతో కలిపారు. తెలంగాణను ఆంధ్రాతో కలిపినప్పుడు ఒక అమాయక అమ్మాయికి.. ఉషారైన అబ్బాయి చేస్తున్న పెళ్లి ఇది అని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ వేదికగా అన్నారు. ఈ బంధం బాగుంటే సరే.. లేదంటే ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పారు. ఆనాడే ఇష్టం లేని పెళ్లి చేసినట్లు ఆయనే అంగీకరించారు. ఆనాడు తెలంగాణను ఆంధ్రాతో కలిపి ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు.
1956 నుంచి 1969 జరిగిన అన్యాయలకు రగలిపోయిన తెలంగాణ ప్రజలు 1969 తొలిదశ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 వరకు ఈ ఉద్యమం అద్భుతంగా సాగింది. తెలంగాణ పౌరుషం చాటుతూ అప్పుడు ప్రజా సమితి పార్టీ 14 పార్లమెంట్ సీట్లలో 11 సీట్లు గెలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆత్మను ప్రజలు సాక్షాత్కారించారు. 371 మంది ఆనాటి పోరాటంలో అసువులు బాసారు. అయిన సరే తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ బేఖాతరు చేసింది అని దుయ్యబట్టారు.
అయినప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, మేధావులు, కవులు, కళాకారులు ఎప్పటికైనా ఎవరైనా ఉద్యమ నేత రాకపోతారా అని తెలంగాణవాదాన్ని వ్యాప్తి చేశారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా కేసీఆర్ వారు అనుకున్నట్లుగా ఉద్యమాన్ని ప్రారంభించారు. కరీంనగర్ వేదికగా రణగర్జనతో కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టండంటూ ఎంతో ధైర్యంగా కేసీఆర్ గారు ప్రకటన చేశారు. పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ గారు మాత్రమే అని పేర్కొన్నారు.
ఇవ్వాళ చాలా మంది చాలా మాట్లాడుతూ కేసీఆర్ గారిని తక్కువ చేయాలని ప్రయత్నించవచ్చు. కానీ కేసీఆర్ గారు 2001 లో తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా ఆయనకు 46 ఏళ్లు మాత్రమే. ఆయనకు నిజంగా పదవుల మీద మోజు ఉంటే అప్పటి ముఖ్యమంత్రి ఇచ్చిన మంత్రి పదవి ఆఫర్‌ను తీసుకొని హాయిగా ఉండవచ్చు. తెలంగాణ నాయకులు పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెడతారన్న అపవాదుకు వ్యతిరేకంగా ముందు తన పదవులకు రాజీనామా చేసి ఆయన పార్టీ ప్రారంభించారు అని అన్నారు.
14 ఏళ్లు ఎదురుదెబ్బలు, విజయాలు, అపజయాలు, అటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని ఊరుకుంటే అనే పాట ను కూడా కేసీఆర్ గారు రాశారు. కేసీఆర్ అంటే ఒక పేరు కాదు. కేసీఆర్ గారు అంటే ఒక పోరు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి ఒక్కో మాట తూట లాగా పేలింది. రాజకీయ వేదిక ద్వారానే తెలంగాణ సాధిస్తామని ఆయన చెప్పారు అని గుర్తు చేశారు.
ఈరోజు తెలంగాణ సాధన జరిగిందంటే దాని మూడు కారణాలు. ఒకటి కేసీఆర్ నాయకత్వం, రెండు అమరుల ప్రాణత్యాగం, మూడోది కాంగ్రెస్ కర్కశత్వం. కాంగ్రెస్ కర్కశత్వం కారణంగా తెలంగాణ ప్రజల్లో నిప్పు పుట్టింది. కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష కారణంగా రాష్ట్రం ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతదనే పరిస్థితి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమంలో మన మీద తుపాకీ పట్టినోడు ఇప్పుడు ఏదోదో వాగుతున్నాడు. నీకు అధికారం ఉండవచ్చు.. కానీ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్ గారంటేనే ఎనలేని అభిమానం. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయమైతే నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎన్నో అబద్ధపు హామీలు, ఆరు గ్యారంటీలు, నంగనాచి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో ఏ వర్గాన్ని నీ పాలన గురించి అడిగినా సరే బోరున ఏడుస్తున్నారు. గురుకులాలల్లో విద్యార్థులకు కనీసం సరైన భోజనం పెట్టలేక వాళ్లు చనిపోతున్న పరిస్థితి. ఈ పాటి పాలనకు విజయోత్సవాలంట. పోలీసులు లేకుండా ప్రజల్లోకి పోతే ఉరికించి కొట్టే పరిస్థితి ఉంది అని ఎద్దేవా చేశారు.
ఇప్పుడంటే బీఆర్ఎస్‌కు ఎంతోమంది నాయకులు, పెద్ద బలగం ఉంది. కానీ 2001 లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎవరు లేరు. ఆనాడు మనీ, మజిల్, మీడియా, క్యాస్ట్ ఇలా ఏ పవర్ లేదు.. తెలంగాణ వస్తదా అని అందరికీ అనుమానాలు ఉండే. అనుమానాల నీలి నీడల మధ్య ఆగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు అని అన్నారు.
అప్పట్లో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు కేసీఆర్ గారు ఏది చెబితే దానికి ఎస్ అనే వారు. అలా ఎందుకు అంటున్నారని నేను ఒకసారి అడిగితే చాలా ఆసక్తికర విషయం చెప్పారు. 2001 లోనే కేసీఆర్ గారు తెలంగాణ వస్తదని గట్టి చెప్పే వారు. జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు మన వాళ్లు అవుతారని అనేవారని ఆయన నాతో చెప్పారు అని తెలిపారు.
ఓట్ల ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన చెబితే ఆయన చెప్పిందంతా సినిమా లాగా ఉందని అన్నానని అన్నారు. ఐతే కరీంనగర్‌లో జరిగే సింహగర్జనకు రెండు లక్షల మంది రాకపోతే మీరు నాతో ఉద్యమంలో ఉండవద్దని కేసీఆర్ గారు అన్నారని చెప్పారు. ఆ రోజు సభకు మేము 5 గంటలు ఆలస్యంగా వెళ్లినా సరే రెండున్నర లక్షల మంది సభకు వచ్చారని చెప్పారు. ఆనాటి నుంచి కేసీఆర్ గారు ఏది చెప్పినా ఆయన మాటకు ఎదురు చెప్పలేదని ఆయన అన్నారు అని గుర్తు చేశారు.
2009లో ఆమరణ దీక్ష చేసేందుకు వెళ్తున్న కేసీఆర్ గారిని ఇదే అల్గనూరు చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. మమ్మల్ని తప్పించి ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. వందలాది పోలీసులను మొహరించి ఖమ్మం నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కేసీఆర్ గారి ఆ దీక్ష తెలంగాణలో అగ్గి పెట్టింది. అదే రోజు శ్రీకాంతా చారి ఆత్మ బలిదానం చేశారు. ఆ మరుసటి రోజు కిష్టయ్య అనే కానిస్టేబుల్ కూడా ఆత్మహుతి చేసుకున్నారు. ఒక్క ప్రాణం కూడా పోవద్దని ఉద్యమాన్ని ప్రారంభించానని కానీ ఇద్దరు యువకులు చనిపోయారంటూ కేసీఆర్ గారు గుండెలు అలసిపోయేలా విలపించారు అని అన్నారు.
ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల కర్కషత్వం, క్రూరత్వం కారణంగా తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అత్మబలిదానం చేసుకున్నారు. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఉద్యమ పతాక సన్నివేశంగా మారింది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ గారు వివిధ రూపాల్లో పోరాటం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మండమైన మెజార్టీ ఇచ్చి తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పారు అని అన్నారు.
ఆనాటి చరిత్ర ఇవ్వాళ్టి 18, 20 ఏళ్ల పిల్లలకు తెలియదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా చాలా మంచి పనులు చేసిండని మాత్రమే తెలుసు. కానీ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండని వారికి తెలియాలి. ఆనాటి కేసీఆర్ గారి స్ఫూర్తితో మళ్లీ తెలంగాణలో మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేస్తూ వికృతంగా వికటాట్టహాసం చేస్తోంది. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మళ్లీ ఒకసారి సంకల్పం తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మనం పోరాటం చేయాల్సి ఉంది. రాబోయే నాలుగేళ్లు ప్రజల కోసం పోరాటం చేద్దాం. ప్రతి వేదికలో తెలంగాణ పక్షాన పోరాడుదాం అని పేర్కొన్నారు.