mt_logo

కొత్త సచివాలయానికి మంత్రివర్గ ఆమోదం..

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సనత్ నగర్ ఛాతీ దవాఖాన లోని విశాల ప్రాంగణంలో సుమారు 150 కోట్ల రూపాయలతో అధునాతన పద్ధతిలో సచివాలయాన్ని నిర్మించాలని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఇక్కడికే తరలించాలని శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో సచివాలయ నిర్మాణంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

పేద పిల్లల చదువుల్లో ఏర్పడే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ పథకాన్ని విరమించాలని కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం మిగిల్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం రూ. 862 కోట్లు విడుదల చేయాలని, ప్రభుత్వ స్థలాల్లో 125 గజాలలోపు ఇండ్లు నిర్మించుకున్న పేదలకు వాటిని ఉచితంగా క్రమబద్దీకరించేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి 550 మంది కళాకారులను తీసుకోవాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గా వరంగల్ ను మార్చాలని మంత్రివర్గం తీర్మానించింది. తిరుపతి వేంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గ, వరంగల్ భద్రకాళి, కురవి వీరభద్ర స్వామి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలకు ఆభరణాలు సమర్పించాలని, అజ్మీర్ దర్గా వద్ద యాత్రికులకు వసతిగృహం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

కొత్త రాష్ట్రంలో తెలంగాణ సమాజానికి ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని, రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదని సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాల్లో సొంత పార్టీ నాయకులున్నా సహించేదిలేదని, వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలంటే అందరూ నీతి, నిజాయితీగా పని చేయాలని, అవినీతి సహించేది లేదన్న సంకేతాలు కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలని మంత్రులకు సూచించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *