mt_logo

‘కొత్త’కు పట్టంగట్టిన మెదక్ టీఆర్‌ఎస్

-3.61 లక్షల భారీ మెజార్టీతో విజయం
– రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి
– మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి
– ప్రతి రౌండులోనూ టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం
– సంబురాలు చేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
ఊహించినట్టే మెదక్ ఓటర్లు టీఆర్‌ఎస్‌పైనే గులాల్ చల్లారు. పార్లమెంట్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందని పోటీలుపడి ఆరోపణలుచేసిన ప్రతిపక్ష పార్టీల నేతల చెంపలు ఛెళ్ల్లుమనిపించారు మెతుకుసీమ ఓటర్లు. తాము ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌వైపే ఉన్నామని మరోసారి తేల్చిచెప్పారు. మొత్తం 22 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై 3,61,277 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఉప ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కనిపించకుండా పోయారు.

ఓటమి ముందుగానే ధ్రువీకరించుకుని కౌటింగ్ సెంటర్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చింది. మంగళవారం పటాన్‌చెరు సమీపంలోని గీతం యూనివర్సిటీలో ఓట్లు లెక్కించారు. ఉదయం 8 గంటలకు లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్లలో లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్ నుంచే టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రావడం మొదలైంది. మొత్తం లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై 3,61,277 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,43,075 ఓటర్లు ఉండగా ఈ ఎన్నికలో 10,46,080 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ శాతం 67.79గా నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 9.56 శాతం పోలింగ్ తగ్గింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత సీఎం కే చంద్రశేఖర్‌రావుకు 3,97,029 భారీ మెజార్టీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో 10,46, 080 ఓట్లు పోల్‌కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,71,800, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లకా్ష్మరెడ్డికి 2,10,523, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)కి 1,86,334 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు 10, బీజేపీకి 9, కాంగ్రెస్‌కు ఒక్కటి వచ్చాయి. ఈ ఎన్నికల్లో 9.56 శాతం పోలింగ్ తగ్గడంతో మెజారిటీ తగ్గినట్టుకనిపించినా, టీఆర్‌ఎస్‌కు ఓట్లశాతాన్ని పరిశీలిస్తే గతంలో కంటే 1.2 శాతం పెరిగింది. గతంలో సునీతా లక్ష్మారెడ్డి ప్రాతినిథ్యం వహించిన నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు తక్కువగా 6473 మెజార్టీ రాగా మిగతా ఆరు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ వచ్చింది.

అత్యధికంగా మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు 93,759 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్‌ఎస్ మెజార్టీ 76,733గా నమోదైంది. ఆ తరువాత స్థానంలో దుబ్బాక నిలిచింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 67,366 ఓట్ల మెజార్టీ వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 51,933 ఓట్ల మెజార్టీ వచ్చింది. గజ్వేల్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉండగా మిగతా ఐదు నియోజకవర్గాల్లో మూడోస్థానంతో సరిపెట్టుకున్నది.

మధ్యాహ్నం 1గంట వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయంతో పార్టీ శ్రేణులు కౌటింగ్ సెంటర్ ఆవరణలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మెదక్ ప్రజలు ప్రభుత్వం వైపే ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్, కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గెలుపొందిన తరువాత కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా నుంచి ధ్రువపత్రం తీసుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణలు ప్రభాకర్‌రెడ్డి వెంట ఉన్నారు.

నా విజయం ప్రజలకే అంకితం: కొత్త ప్రభాకర్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌పై పూర్తి విశ్వాసాన్ని ఉంచి తనను ఎన్నుకున్న జిల్లా ప్రజలకే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని మెదక్ ఎంపీగా గెలుపొందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాధన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోనే సాధ్యమని జిల్లా ప్రజలు విశ్వసించి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా, అభివృద్ధికోసం పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు, వారి కుటుంబాలకు ఆయన శిరస్సు వంచి నమస్కరించారు. ఎంపీగా విజయం సాధించిన ప్రభాకర్‌రెడ్డికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు పంకజ్ అగర్వాల్, ముంగాలలు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

అనంతరం యూనివర్సిటీ ఆవరణలోకి వచ్చిన ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ రంగుల్లో ముంచెత్తాయి. వర్సిటీ ఆవరణలో ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రత్యేకమైన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వలేమని పేర్కొన్నారు. కేవలం టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన పాత వాగ్దానాలనే ప్రజల ముందుకు తీసుకెళ్లామన్నారు. ఆ నమ్మకంతోనే ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారని వివరించారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా, శక్తివంచనలేకుండా అభివృద్ధికోసం కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, అంతర్గతరోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే పయనిస్తానని చెప్పారు. కేసీఆర్ సహకారంతో మెదక్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచిన తనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి తనపై మరింత పెద్ద భారం పెట్టారని, ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలియజేశారు. గత సాధారణ ఎన్నికల్లోకంటే ఉప ఎన్నికల్లో 9%ఓట్లు తక్కువగా పోలైప్పటికీ 1.27 శాతం ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *