సంక్రాంతి తర్వాత 99% ఉద్యోగులంతా సంతోషపడేలా, ఉద్యోగుల ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా, వారు ఊహిస్తున్న పద్ధతిలోనే పదవ పీఆర్సీ ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవ పీఆర్సీ త్వరలోనే ప్రకటిస్తామని, సంక్రాంతి వరకు పీడదినాలు కాబట్టి ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయడంలేదన్నారు. పండుగ అనంతరం పీఆర్సీ పైన ప్రకటన ఉంటుందని, ఉద్యోగులందరి కడుపు నిండేలా, కొత్త సంవత్సరం కానుకగా ఇది ఉంటుందని తెలిపారు. ఫిట్ మెంట్ ఎంత ఇవ్వాలనే విషయం, ఉద్యోగుల పంపిణీపైన లెక్కలు తేలలేదని, అందుకే కొద్దిగా ఆలస్యమవుతున్నదని చెప్పారు.
హెల్త్ కార్డుల విషయంలో కూడా ఉద్యోగులపై నయాపైసా భారం పడకూదదన్నది ప్రభుత్వ సంకల్పమని, పైగా కుటుంబీకుల ఆస్తుల విక్రయంలో అనుకున్నంత రెవెన్యూ వస్తే అదనంగా ఒక ఇంక్రిమెంట్ కూడా ఉద్యోగులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఉద్యోగీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగులంతా ప్రభుత్వ కుటుంబ సభ్యులని, వందకు వందశాతం తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు. సకలజనుల సమ్మె ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఒక అద్భుతమైన ఉద్యమమని, టీజేఏసీ చైర్మన్ కోదండరాం సారధ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు, అన్నిరకాల వృత్తులకు చెందినవాళ్ళు కలిసి ఉద్యమం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.