mt_logo

కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

గోండు వీరుడు కొమురం భీం 74వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం 11.50 ని.లకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లి ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కు చేరుకొని అక్కడ కొమురం భీం విగ్రహాన్ని, స్మృతి చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం భీం జీవిత చరిత్ర, విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత భీం స్మారక భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించి గిరిజన దర్బార్ కు హాజరై ప్రసంగిస్తారు.

గోండు, కొలాంలకు జల్, జంగల్, జమీన్ పై సర్వహక్కులు కావాలని నిజాం కాలంలోనే కొమురం భీం ఉద్యమించారు. అలనాటి నైజాం సర్కారు అమానవీయ చర్యలనుండి అడవి బిడ్డలను కాపాడటం కోసం కొమురం భీం చేపట్టిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. ఒకప్పటి నిజాం నవాబుల నుండి, మొన్నటి సీమాంధ్ర పాలకుల దాకా దోపిడీకి గురవుతున్న గిరిపుత్రులకు ఇప్పుడు సీఎం కేసీఆర్ పర్యటన ఊరట కలిగిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని, బొటానికల్ గార్డెన్ ను, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా జోడేఘాట్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని అటవీ శాఖామంత్రి జోగు రామన్న తెలిపారు. అంతేకాకుండా కొమురం భీం కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే దిశగా సీఎం హామీ ఇవ్వనున్నట్లు తెలిసింది. మొదటిసారిగా కేసీఆర్ సీఎం హోదాలో జిల్లాకు రానున్న సందర్భంగా మంత్రి జోగు రామన్న, కలెక్టర్, ఐటీడీఏ పీవో తదితరులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *