ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కు చేరుకుని కొమురం భీం సమాధికి నివాళులర్పించారు. అనంతరం కొమురం భీం స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి ఆయన పేరు మీద ఏర్పాటు చేయబోయే మ్యూజియానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొమురం భీం బాటలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, సమైక్య పాలనలో కొమురం భీంకు సరైన గుర్తింపు దక్కలేదని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాను బాగుచేయాలని జిల్లా ప్రజలు ఆదేశాలు జారీ చేశారని, ఇక్కడి అడవి బిడ్డలు, అన్నదమ్ములంతా కలిసి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం ఇచ్చారన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ. 25 కోట్లతో కొమురం భీం స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని, ఆయన కుటుంబానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొమురం భీం కుటుంబంలోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, జోడేఘాట్ కేంద్రంగా 100 ఎకరాల్లో అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తామని, ఆసిఫాబాద్ లో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కొమురం భీం పేరుమీద జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజిస్తామని, కొత్తగా ఏర్పడే జిల్లాకు కొమురం భీం పేరు పెడతామని కేసీఆర్ చెప్పారు. గిరిజనులకు రోగాలు రాకుండా చైతన్యవంతుల్ని చేయాలని, 500 కళాకారులతో 20 బృందాలుగా ఏర్పాటు చేసి గిరిజనులను చైతన్యం చేసేలా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. బంజారా హిల్స్ లో బంజారా భవన్, ఆదివాసీ భవన్ నిర్మిస్తామని, హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రుల నుండి గిరిజన తండాలకు డాక్టర్లను పంపించి వైద్యాన్ని అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
ప్రాణహిత-చేవెళ్ళ నీళ్ళు ముందుగా ఆదిలాబాద్ జిల్లాకే కేటాయించి తర్వాతే మిగిలిన ప్రాంతాలకు పంపిస్తామని, జోడేఘాట్ లో అభివృద్ధి పనులకు మూడు రోజుల్లో నిధులు మంజూరు చేస్తామని, వచ్చే సంవత్సరం లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో కొమురం భీంకు గుర్తింపు తెచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని, అవసరమైతే రెండుమూడు రోజులు జిల్లాలో ఉండి ఇక్కడి సమస్యలు తెలుసుకుంటానని కేసీఆర్ చెప్పారు.