mt_logo

అభివృద్ధిలో దూసుకుపోతున్న కేటీఆర్ దత్తత నియోజకవర్గం కొడంగల్

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకున్న వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కొండంగల్ ను దత్తత తీసుకొని, అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం, కోట్లాది రూపాయలతో కమ్యూనిటీ హాళ్లు, చెక్‌డ్యాంలు, ప్రభుత్వ దవాఖానలు, మినీ ట్యాంక్‌బండ్లు, కోస్గిలో బస్‌ డిపో, బస్‌స్టేషన్‌, కొడంగల్‌లో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కృషి చేశారు. కొడంగల్‌కు మున్సిపల్‌ భవనం, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, కొడంగల్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించి నిధులను విడుదల చేయాలని ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. ఇటీవల దుద్యాల, గుండుమాల్‌లను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. కేటీఆర్‌ దత్తత.. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో నిధుల వరద పారుతున్నది. దీంతో స్థానికులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు జేజేలు పలుకుతున్నారు.

గతంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని చాలా గ్రామాలు, తండాలకు రోడ్ల సౌకర్యం ఉండేది కాదు. రెండేండ్లలో ప్రతి గ్రామపంచాయతీకి రోడ్డు సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టి బీటీ, సీసీ రోడ్ల అభివృద్ధికిగాను పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. కమ్యూనిటీ భవనాలు, చెక్‌డ్యాంలు, ప్రభుత్వాసుపపత్రి, డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్‌బండ్‌, గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కోస్గిలో బస్‌ డిపో, బస్‌ స్టేషన్‌ నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. 

కొడంగల్‌ నియోజకవర్గాన్ని కేటీఆర్‌ దత్తత తీసుకున్న తదనంతరం నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయంటూ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు నీరాజనాలు పలుకుతున్నారు కొడంగల్ వాసులు. అర్హులందరికీ రైతుబంధు సాయం, రైతుబీమా, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారనే విషయాలపై అధికారులతో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మంత్రి కేటీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీనివ్వడంతో మునుగోడు ప్రజలు కేటీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే దత్తత తీసుకున్న కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ జరుగుతుండడం గమనార్హం. కొడంగల్‌ మాదిరిగా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి రావాలంటే రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ దత్తతతోనే సాధ్యమంటున్నారు మునుగోడు ప్రజలు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కొడంగల్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.350 కోట్లకుపైగా నిధులతో కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లే ప్రతి అంశానికి సంపూర్ణ సహకారం అందిస్తూ కొడంగల్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలతోపాటు డిగ్రీ కాలేజీ మంజూరు చేయగా, రూ.4.57 కోట్లతో నిర్మించిన డిగ్రీ కాలేజీ ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా రవాణా సదుపాయాలకు ఇబ్బందులను ఎదుర్కొన్న కోస్గి ప్రజల కల నెరవేరింది. కోస్గిలో రూ.2 కోట్లతో నిర్మించిన బస్‌ డిపోతోపాటు రూ.కోటితో నిర్మించిన బస్‌ స్టేషన్‌ అందుబాటులోకి వచ్చింది.

రూ.2 కోట్లతో శాటిలైట్‌ బస్‌ డిపో, రూ.కోటితో బస్‌ స్టేషన్‌ నిర్మాణాలు చేపట్టారు. కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.185 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణాలు కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలను కలిపే రోడ్ల నిర్మాణాలకు రూ.85 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.100 కోట్లు విడుదలయ్యాయి. దౌల్తాబాద్‌-మద్దూరు, కోస్గి-మద్దూరు, రావులపల్లి-దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌-కోస్గి రోడ్ల నిర్మాణాలతోపాటు కొడంగల్‌ బాపల్లి తండా రోడ్డు నిర్మాణం కూడా పూర్తయ్యింది. కొడంగల్‌ నియోజకవర్గంలో కొడంగల్‌తోపాటు కోస్గిలను కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడంతోపాటు సంబంధిత మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులను విడుదల చేశారు. సంబంధిత నిధులతో రెండు మున్సిపాలిటీల్లో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలు, సీసీ రోడ్లు, దుకాణ సముదాయాలు, పార్కులు, సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.

దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని పెద్ద చెరువును రూ.7.08 కోట్లతో మినీట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేశారు. గిరిజన సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గతంలో కనీసం రోడ్లకు నోచుకోని గిరిజన తండాలకు బీటీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తరతరాలుగా ఆదరణ కరువైన గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా రూ.1.20 కోట్లతో బంజారాభవన్‌ నిర్మించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.15 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చెక్‌డ్యాంలు మంజూరు కాగా, అందులో మూడు పూర్తికాగా, రెండు చెక్‌డ్యాంల పనులు కొనసాగుతున్నాయి. రూ.8.14 కోట్ల నిధులతో ఐదు మండలాల్లో 37 రైతు వేదికలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *