mt_logo

జైలు గోడల్లోంచి…జనం గుండెల్లోకి

కోదండరామ్‌ బృందానికి బెయిల్‌
లాఠీలు, తూటాలు, చెరసాలలు ఉద్యమాన్ని ఆపలేవు
అరెస్టుకు మూల్యం చెల్లించకతప్పదు
ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం : కోదండరామ్‌

తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఉద్యమించి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ బృందానికి జైలు గోడల నుంచి విముక్తి లభించింది. హైదరాబాద్‌-బెంగళూర్‌ నేషనల్‌ హైవేపై ఈనెల 21న నిర్వహించిన సడక్‌ బంద్‌ సందర్భంగా కోదండరామ్‌ సహా ఎనిమిది మందికి అలంపూర్‌ కోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల పూచికత్తుపై వారికి బెయిల్‌ మంజూరైంది. టీిజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌, టీఆర్‌ఎస్‌ ఎల్‌పి నేత ఈటెల రాజేందర్‌, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, నాయకులు జితేందర్‌రెడ్డి, భూషణం, గోవర్ధన్‌, దుబ్బన్నకు బెయిల్‌ మంజూరైంది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, నాయకులు గట్టు తిమ్మప్ప, తుమ్మల రవికుమార్‌ శనివారం కోర్టులో లొంగిపోయారు. వీరికి ఏప్రిల్‌ నాలుగు వరకు రిమాండ్‌ విధించింది. వారు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని కోర్టు పేర్కొంది. వారిని మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన కోదండరామ్‌ బృందానికి జేఏసీ, టీఆర్‌ఎస్‌, తదితర పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఓపెన్‌టాప్‌ జీపులో అలంపూర్‌ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, లాఠీలు, తూటాలు, చెరసాలలు ఉద్యమాన్ని ఆపలేవని అన్నారు. తమ అరెస్టులకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎంతగా అణచాలని చూస్తే అంతేశక్తితో ఎగసిపడుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం ప్రజల హృదయాల్లోంచి వచ్చిందని, దానిని ఎవరూ అణచలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పాలకులు తీరు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ సాధన కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని తెలిపారు.

(జనంసాక్షి సౌజన్యంతో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *