mt_logo

నేరమే అధికారమైతే…!

By- మాడభూషి శ్రీధర్

“నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం” అని పిలిచారట. తర్వాత మారణాయుధాలతో అల్లర్లు చేసినారట. ఈ ఆరోపణలతో తెలంగాణ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. ఇవి నిజమే అని పోలీసులైనా నమ్ముతారా? అది తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ సాగుతున్న రాజకీయ సమరం. ఉద్యమంలో బంద్‌లు రాస్తారోకోలు ఎటువంటివో సడక్ బంద్ కూడా అంతటిదే. ప్రభుత్వం పైన ప్రజానుకూల నిర్ణయాలు చేయాలని వత్తిడి తెచ్చేందుకు బంద్‌లు ధర్నాలు రాస్తా రోకోలు చేయడం సాధారణం. కాని తెలంగాణ ఉద్యమ ఉద్యోగ నాయకులు మాత్రం నేరాలు చేద్దాం రండి, మాకు నేరాలలో సహకరించండి అందరూ నేరాలు చేయండి అని ప్రోత్సహించారట. (సెక్షన్ 109 భారతీయ శిక్షాస్మృతి). ఇదీ పోలీసుల ఆరోపణ.

తెలంగాణ రాష్ట్రం కోరడం రాజ్యాంగబద్ధమైన డిమాండ్. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తున్న రాజకీయం పైన మౌనం వీడని ప్రధాని మీద ఒత్తిడి చేయ డం ప్రజాస్వామ్యబద్ధమైనది. అందులో భాగంగా శాంతియుతంగా సడక్ బంద్ చేయాలని పిలుపు ఇవ్వడం నేరం కాదు. నేర ప్రేరణ కాదు. ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గానీ,ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గాని ఇతర ఐకాస నాయకులు గానీ నేరాలు చేస్తున్నారా, చేయమంటున్నారా? ఆ పిలుపు విని ఉద్యమించిన ప్రజలు శాంతియుతంగా రోడ్డుమీద కూర్చోవడం లేదా నిలబడడం నేరాలా? తెలంగాణ వద్దని ఉద్యమిస్తు న్న కిరాయి ఉద్యమకారులపైన ప్రభుత్వం ఇటువంటి కేసులే పెట్టిందా?

సడక్ బంద్ ఉద్యమానికి ముందు 1777మంది కార్యకర్తలను అరె స్టు చేశారు. 57 కేసులు నమోదు చేశారు. అయినా ఉద్యమం ఆగలేదు. తెలంగాణ ఉద్యమ నేతలు కోదండరాం ప్రభృతులపైన బనాయించిన కేసుల వివరాలేమిటో తెలుసుకుంటే అవి ఎంత అబద్ధపు ఆరోపణలో అర్థమవుతుంది. మొదటిది,నేర ప్రేరణ, ఏది నేరం ఎవ రు ప్రేరేపించారు. అసలు లోతుగా ఆలోచిస్తే, జనం సడక్ బంద్ కు దిగేట్టు రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రభుత్వ పెద్దలు, తెలంగాణ ను రగిలించి ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా నోటికొచ్చిన భాషలో మాట్లాడుతున్న బాధ్యతారహిత ప్రజావూపతినిధులు, తెలంగాణపై కక్ష గట్టి, వ్యతిరేక ప్రచారాలు చేస్తున్న మీడియా నేర ప్రేరకులు. వారి మీద కేసులు పెట్టాలి. వారే ఆనేరగాళ్లు. కానీ వారిమీద కేసులు పెట్ట రు. ఉద్యమాలను అణచడానికి మాత్రం తప్పుడు కేసులు పెడతారు. తప్పుడు నేరప్రేరణ ఆరోపణకు సెక్షన్ 109 ఒక ఆధారం. ఐపిసిలో ఈ సెక్షన్ కింద ఇచ్చిన ఉదాహరణలు కాని, సెక్షన్‌లో ఉన్న నిర్వచనం కాని తెలంగాణ ఉద్యమ నేతలమీద ప్రయోగించడం అసమంజసం.

Indian Penal Code, Section 109. Whoever abets any offence shall, if the act abetted is committed in consequence of the abetment, and no express provision is made by this Code for the punishment of such abetment, be punished with the punishment provided for the offence.

ఇక మరో నేరారోపణ. కోదండరాం ప్రభృతులు మారణాయుధాలు పట్టుకుని హింసాత్మక అల్లర్లు చేయడానికి చట్టవ్యతిరేకంగా సమావేశం అయ్యారట. ఆ మారణాయుధాలను ఉపయోగించి చంపే అవకాశం ఉందట. అటువంటి చట్టవ్యతిరేక అల్లర్లు చేయడానికి మారణాయుధాలతో సిద్ధం కావడం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారట.

బహుశా కోదండరాం పెన్ను పట్టుకుని వెళ్లి ఉంటాడు. అది మారణాయుధం. అదన్న మాట హింసాత్మక మారణాయుధ సహిత అల్లర్ల కుట్ర. అదే ఉద్దేశ్యంతో నేరాలు చేయడానికి గుమికూడిన ఆ మారణాయుధ సహిత అల్లర్ల సంకల్ప బృందం లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నేరస్తుడే కనుక అందరినీ మూడేళ్ల పాటు జైలుకు పంపవచ్చు. కాని ప్రభుత్వం కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. వీరిని జైలుకు పంపితే చాలని వారి అభిప్రాయం.

ఈ నేరాలన్నీ సరిపోనట్టు ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఉత్తర్వును ఉల్లంఘించ డం మరో నేరం. సెక్షన్ 188 కిందా పబ్లిక్ సర్వెంట్ జారీచేసిన ఉత్తర్వులు ఉల్లంఘించి తద్వారా అవరోధాలు కల్పించడం నేరం. దీనికి ఆరు నెలల దాకా జైలు శిక్ష జరిమానా కూడా విధించవచ్చు. దుర్మార్గపు నిర్బంధం అనే నేరం ఎవరు చేశారో తెలుసా? పోలీసులు కాదు. పోలీసు వారి ఆరోపణ ప్రకారం కోదండరాం మొదలైన నాయకులు దుర్మార్గంగా కొందరిని ఒక మార్గంలో నడవకుండా ఆపి నిర్బంధం పాలుచేసి సెక్షన్ 340 కింద నిర్వచించిన నేరం చేశారట. ఈనేరానికి ఏడాది జైలు, 1000 రూపాయల జరిమానా విధించవచ్చు.

తెలంగాణ ఉద్యమనాయకులు చేసిన మరో నేరం యాభై రూపాయలు లేదా అంతకన్న ఎక్కువ నష్టంచేశారట. సెక్షన్ 427 నేరం అది. ఇవి కాకుండా ప్రజా ఆస్తులు విధ్వంస నిరోధక చట్టం 1984 అనే మరో చట్టాన్ని కూడా ఈ నేతల మీద ప్రయోగించారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చేస్తే అయిదేళ్ల జైలు, పేలుడు పదార్థా లు, నిప్పు ద్వారా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంచేస్తే ఏడాదినుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు.

తెలంగాణ ఉద్యమనాయకులు ప్రేలుడు పదార్థాలు తెచ్చుకుని సడక్ బంద్ చేస్తున్నారని ఈ సెక్షను ప్రయోగించడం ద్వారా తప్ప మరే నాయకుడు పోలీసు అధికారి కూడా ఆరోపణ చేయలేదు. తెలంగాణ వ్యతిరేక వార్తలు రాయడానికి అత్యుత్సాహంతో ఉన్న మీడియా మిత్రులు కూడా రాయలేదు. అయినా కేసులు పెట్టి లోపల తోయడానికి తోచిన ఆరోపణలన్నీ చేసి కోర్టుముందు పడేశారు, జైల్లో తోసేశారు.

అరెస్టు అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆ చట్టాల్ని సవరించారు. ఏడేళ్ల జైలుశిక్ష కన్న తక్కువ శిక్షలు నిర్ధారించిన సెక్షన్ల కింద కేసులు నమోదయితే అసలు అరెస్టేచేయకూడదని కొత్తగా క్రిమినల్ లా ను సవరించుకున్నాం. కాని అదెవరికీ గుర్తుండదు.

ఈ చట్టంకింద కోదండరాంను ఇతరులను అరెస్టుచేయడానికి వీల్లేదు. అయినా ఎందుకు అరెస్టు చేసారు? అయితే విచిత్రమేమంటే ఈ కేసులన్నీ బెయిలబుల్ కేసులు. అంటే పోలీసు అధికారులే బెయిల్ ఇవ్వదగిన నేరాలు. కాని వారు ఇవ్వరు. ఇవ్వకూడదని వారికి ఉత్తర్వులు ఉంటాయి. ఆ రకం ఆదేశాలు కాగితం మీదా ఉండవు. ముఖ్యమంత్రికి అసలు తెలంగాణానేతలు అరెస్టయిన విషయమే తెలియదని అంటాడు. ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో, మారణాయుధాలతో అల్లర్లు చేయడానికే రోడ్లమీదికి వచ్చారని ముఖ్యమంవూతికి గానీ హోంమంత్రిగారికి గానీ చెప్పారో లేదో గాని వారికి తెలియదని కూడా వార్తలు వచ్చాయి. చేయని నేరాలతో ఆరోపణలు చేయడం, అరెస్టు చేయదగని నేరాలలోఅస్టు చేయడం, బెయిల్ ఇవ్వతగిన నేరాలే అయినా పోలీసు అధికారులు బెయిల్ ఇవ్వకపోవడం వరుస అన్యాయాలు. ఉద్యమాన్ని అన్యాయంగా అణచే మార్గాలు.

బెయిల్ ఇవ్వదగని నేరాలు అంటే పోలీసు అధికారులే తమంత తాము బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని అర్థం. అటువంటి కేసులలో న్యాయాన్యాయాలు పరిశీలించి పోలీసులు మోపిన నేరాల నిజానిజాలను పరీక్షించి అన్యాయంగా అరెస్టు చేశారని అర్థమైన వెంటనే బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇవ్వ కూడదని ముందే నిర్ణయించుకుంటే స్వేచ్ఛను ఎవరూ రక్షించలేరు. మొత్తం 11 మంది నేతల మీద ఇటువంటి వింత వింత కేసులు పెట్టారట. వారిలో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారట. వారు కూడా కోర్టు ముందుకు వస్తే తప్ప అరెస్టయి జైల్లో ఉన్న 8 మందికి బెయిల్ ఇవ్వరట. చట్టంలో ఈ సౌకర్యం ఉంటే పోలీసులు ప్రతికేసులో ఒకరిద్దరిని అసలు అరెస్టే చేయరు. ఇంకా చాలా కాలం ఈ కేసులో అరెస్టు చేయకపోవచ్చు. అందాకా కోదండరాంకు గానీ ఇతరులకు గానీ బెయిల్ రాదని ఈ అన్యాయ సూత్రాలు వివరిస్తున్నాయి. ఇదామన న్యాయం? ఇటువంటి అసమంజస కారణాలమీద బెయిల్ నిరాకరించి స్వేచ్ఛకు ప్రజాస్వామ్య ఉద్యమాలకు హాని చేసేందుకు స్వతంత్ర భారత దేశం లో కూడా బ్రిటిష్ పాలనలో వారి బానిసల తరహాలోనే అధికారులు వ్యవహరించడం ఆశ్చర్యకరం.

మరీ బాహాటంగా తప్పుడు కేసులు నమోదు చేసే పోలీసు అధికారులు తమను ఆ విధంగా ఎవరు ఆదేశించారో వెల్లడించాలి. అసలు ఎవరు ఆదేశించినా వారు తప్పుడు కేసులు పెట్టడం వృత్తి ధర్మానికి న్యాయానికి విరుద్ధం.ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్ 24 గంటలు మించి జైల్లో ఉన్నాడు కనుక ఉద్యోగంనుంచి తొలగించ వచ్చేమోనని, తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చేమోనని ఆలోచించే కుట్రదారులు మరి కొందరు. వారిలో తెలంగాణ వ్యతిరేక మీడియా వర్గాల ఉత్సాహం మరికొంత. ఎవరికీ బాద్యత లేదు, జవాబుదారీతనం లేదు. ద్వేషం ఒక్కటే లక్షణం. అణచివేత ఒక్కటే లక్ష్యం.

రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు రాజకీయ ఉద్యమాలమీద కూడా పోలీసులను చట్టాలను వాడుకోవడం ప్రభుత్వాలకు అలవాటయింది. సంకీర్ణ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి రాజకీయ వ్యూహాలకన్నా పోలీసు ఫైళ్లను చట్టాల సెక్షన్లను ఆయుధాలుగా విసురుతున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా రాజకీయ వ్యూహ రచయితలు అవసరం లేదు. వారికి సీబీఐ చాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమానికి కొత్త వ్యూహాలు రాజకీయ నైపుణ్యాలు ఏవీ అవసరం లేదు. పోలీసులకు తెలిసిన కేసుల సెక్షన్లు చాలు. దానికి పెద్ద తెలివితేటలు కూడా అవసరం లేదు. రాయించుకున్న జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ చాలు. తప్పు డు కేసులు పెట్టడం చట్టాలను దుర్వినియోగం చేయడమే అసలైన నేరం. ఆనేరానికి శిక్షలు వేయాలని అనేక దేశాల్లో చట్టాలు చేసుకున్నారు. అటువంటి చట్టమే మనదేశంలో ఉంటే ఎందరు ప్రభుత్వ పెద్దలు, ఎందరు పోలీసు అధికారులు జైల్లో ఉంటారో చెప్పలేము. పదవులు రాజకీయం అధికార రక్షణ, కుట్రలుమోసాలు, దుర్మార్గపు ప్రచారాలు, (ఇన్)జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ సూచించిన దుర్మార్గపు ఉద్యమ అణచివేత నీచ విధానాలు అమలు చేసే చోట న్యాయం పోలీసుల దగ్గరో లేక ఇంకెక్కడో దొరుకుతుందా? దొంగకేసులు పెట్టే వారే దొంగల కన్న పెద్ద నేరస్తులనే చైత న్యం జనంలో రావాలి.

రచయిత నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు – మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *