తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పదవిని, రాజ్యసభ సభ్యుడి పదవిని త్యాగం చేసిన కే. కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ తరపున ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కేకే టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, జాతీయ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జాతీయవ్యవహారాలు చూసుకోవడానికి ఆయన కీలకంగా మారుతారని పలువురు టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. అందువల్లనే కేకేను రాజ్యసభ బరిలో నిలబెట్టడానికి కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్నంతా చక్కబెట్టడానికి కేసీఆర్ ఈరోజు హైదరాబాదుకు రానున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవాలంటే ఏ పార్టీనుండైనా 40మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బలం 22మంది ఎమ్మెల్యేలు. మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉండగా, బీజేపీ, సీపీఐ పార్టీలనుండి 8మంది మద్దతు ఉంది. ఎంఐఎం పార్టీ మద్దతు కూడా టీఆర్ఎస్ కే ఉంటుందని భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుండి కూడా కేకేను అభిమానించే నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి రావడానికి కూడా కొందరు ఎమ్మెల్యేలు చూస్తున్న తరుణంలో కేశవరావు రాజ్యసభ అభ్యర్ధిత్వం నల్లేరు మీద నడకే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మద్దతు తెలిపే అన్ని పార్టీలతో చర్చలు జరిపి కేకేకు కావలిసిన బలాన్ని కూడగట్టుకోవాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తుంది.