మహబూబ్ నగర్ జిల్లా, ఆమనగల్లు మండలం కోనాపూర్ లో బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కోచైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ద్వారానే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అధికారం దక్కుతుందని, అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడుస్తుందని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులు కుట్రలు చేసి రాష్ట్ర ఏర్పాటు అడ్డుకుంటారనే అంబేద్కర్ కేంద్రానికే రాష్ట్రాల ఏర్పాటుపై అధికారాన్ని ఉంచుతూ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును ఎవరూ ఆపలేరని, బిల్లును కేంద్రానికి పంపేవరకూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈటెల స్పష్టం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూసి ప్రజల హక్కులను కాపాడడంలో బాబూ జగ్జీవన్ రాం ఎంతో కృషి చేశారని తెలిపారు.
టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల నెత్తిమీద ఆంధ్ర బండరాయి ఉందని, దాన్ని దించివేశాక బంగారు తెలంగాణ సాధించుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. చిన్న రాష్ట్రాల వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సీమాంధ్ర నాయకులు భోగి మంటల్లో తెలంగాణ బిల్లును వేస్తే వచ్చే తెలంగాణ రాకుండా ఆగదని, ఇలాంటి వారితో 10సంవత్సరాలు కలిసి ఉమ్మడి రాజధానిలో ఎలా ఉంటామని ప్రశ్నించారు. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల పోరాటం, వేలమంది అమరుల కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుందని, ఎంతమంది ఆంధ్రాబాబులు కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేరని తీవ్రంగా హెచ్చరించారు.