హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం ఆవరణలో ప్రారంభమైన 19వ రాష్ట్ర పీడీఎస్ యూ మహాసభలో పాల్గొనడానికి వరంగల్ వచ్చిన టీజేఎసీ చైర్మన్ కోదండరాం తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరన్నారు. కిరణ్ కుమార్ బ్యాటింగ్ 23 అర్థరాత్రి వరకే అని, తర్వాత ఆట 24 నుంచి మన ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు. ప్రజలే అంపైర్లని, 23 అర్థరాత్రి దాటగానే వికెట్లపై ఉన్న బేల్స్ ను తీసేసుకుంటారని, బౌలింగ్ ను సాగదీయవద్దని హెచ్చరించారు.
ఆంధ్రా పెట్టుబడిదారులు ఎక్కడ తమ పెట్టుబడులకు ఆటంకం ఏర్పడుతుందోనని తెలంగాణ ఏర్పాటు అడ్డుకుంటున్నారని, ఎన్టీ రామారావు హయాం నుంచే ఆంధ్రా పెత్తందారీతనం అమల్లోకి వచ్చిందన్నారు. ఆంధ్రా ప్రాంత పెట్టుబడిదారుల ప్రతినిధిగా ఆయన వ్యవహరించారని కోదండరాం ఈ సందర్భంగా తెలియజేసారు. బిల్లుపై చర్చ జరిగేలా చేయడం తెలంగాణ మంత్రుల చేతుల్లోనే ఉందని, బిల్లులో సవరణలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ ఈ నెల 7వ తేదీన ఇందిరాపార్కులో మహాధర్నా చేపడతామని స్పష్టం చేశారు.
పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ, విద్యావిధానాల్లో మార్పు తీసుకురావడం ద్వారా విద్యార్థులను చైతన్యపరచవచ్చన్నారు. ఈ మార్పులు కేవలం ఉద్యమాల ద్వారానే సాధ్యమన్నారు. పాఠ్యాంశాలలో ఎక్కడా తెలంగాణ కవులగురించి ప్రచురించరని, తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులంతా ముఖ్య పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.