ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం, వైరాలలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మూడు రోజులనుంచి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో తిరిగి ఇప్పుడు ఖమ్మం జిల్లా వచ్చానని, ఈ జనాన్ని చూస్తుంటే టీఆర్ఎస్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడంపట్ల ఉన్న సందేహాలను ఆయన తీర్చారు. రాష్ట్ర శాసనసభలో ఒక స్పెషల్ యాక్ట్ పాస్ చేసుకుంటే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం పెద్ద సమస్య కాదని అన్నారు.
ఖమ్మంజిల్లాకు కృష్ణా, గోదావరి నదులపై హక్కుఉందని, నాగార్జునసాగర్ ఎడమకాలువ గార్ల, ఇల్లందు మీదుగా తిరగాల్సిన కాలువ అయితే కేఎల్ రావు చేసిన కుట్రవల్ల దానిని పాలేరు రిజర్వాయర్లో కలిపి ఖమ్మం జిల్లాలో ఆయకట్టును తగ్గించడం జరిగిందని వివరించారు. బయ్యారం ఖనిజాన్ని దోచుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులంతా క్యూ కట్టినా అడ్డుకున్నది టీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ గుర్తుచేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇల్లందు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తామని, కొత్తగూడెం పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, మణుగూరు, కొత్తగూడెం కేంద్రంగా మరో ఎన్టీపీసీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఖమ్మం పట్టణంలో జరిగిన బహిరంగసభ అనంతరం కేసీఆర్ పినపాక నియోజకవర్గంలోని మణుగూరు సభకు హాజరవ్వాల్సి ఉండగా హెలికాప్టర్ కు సిగ్నల్ దొరకక ఇల్లెందుకు మళ్ళించారు. కొత్తగూడెం, వైరా సభల్లో ప్రసంగించిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.