కేంద్రంతో కుమ్మక్కైన చంద్రబాబు కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన పథకాలను రాకుండా అడ్డుపుల్ల వేస్తున్నాడని, టీడీపీ కుట్రపన్ని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ లో కాంగ్రెస్, వైఎస్సాఅర్సీపీ నేతలతో సహా వెయ్యిమంది టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘కేంద్రప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థలనుండి తెలంగాణకు ఇప్పటివరకు కరెంటు రాలేదని, అదే ఆంధ్రా ప్రభుత్వానికి విద్యుత్ విషయంలో పూర్తి న్యాయం చేశారని అన్నారు. తెలంగాణలో ఇంకా పూర్తిస్థాయిలో ఐఏఎస్ లను నియమించకపోవడంలో ఆంతర్యమేమిటని? టీడీపీ చేస్తున్న పాపంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి పాత్ర లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని చంద్రబాబు అడ్డుపడుతున్నాడని, తెలంగాణ ప్రయోజనాలకు టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతున్నా తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు ఖండించడం లేదన్నారు. కరెంట్ సమస్యను అధిగమించడానికి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి టెండర్లు పిలిచినట్లు, మరో 18 నెలల్లో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. రైతులకు కరెంట్ ఇచ్చేందుకు పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించామని, హైదరాబాద్ లోని హోర్డింగ్ లకు విద్యుత్ నిలిపేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఒకటిన్నర సంవత్సరంలో మిడ్ మానేరును పూర్తిచేస్తామని, సంక్షేమ పథకాల కోసం అర్హుల ఎంపిక నిరంతరాయంగా కొనసాగుతుందని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.