mt_logo

మెదక్ జిల్లా గజ్వేల్ నుండి బరిలోకి గులాబీబాస్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటుకు ఏ స్థానం నుండి బరిలోకి దిగాలో టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కేకే ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఇతర పార్టీల నేతలు దొరల పాలన, కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణలో ఇంకా దొరలున్నారా? మా ఇంటి ఆడపడుచును రెండు రోజులు జైల్లో పెట్టి అర్థరాత్రి 3 గంటలకు వదిలేసినప్పుడు దొరలం కాదా? మా కుటుంబమంతా ఉద్యమంలో పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా పాల్గొంటాం. కరుణానిధి, ములాయం, ఇందిరాగాంధీ కుటుంబాలు రాజకీయాల్లో లేవా? టీడీపీ కుటుంబ పార్టీ కాదా? అసలు కుటుంబ పాలన అనేదే రాంగ్ ఫిలాసఫీ. టాలెంట్ ను బట్టి ఓటు వేయాలి. 14 సంవత్సరాలుగా పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇంకా అలాగే మాట్లాడితే ఊరుకోమ’ని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు తీర్చడానికి అధికారం అవసరమని, పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మార్చడానికే గెలుపొందే అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కొండా దంపతులను చేర్చుకోవడంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ముగిసిన అధ్యాయమని, సీపీఐ తో పొత్తుపై రెండుమూడు రోజుల్లో తేలుతుందని, ఏప్రిల్ 11 నుండి ప్రచారం ప్రారంభిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా ఆంధ్రోళ్ళకి భయమని, ఎవరు గెలిచినా సరే, టీఆర్ఎస్ మాత్రం గెలవొద్దని ఆంధ్రా నేతలు కోరుకుంటున్నారని, తెలంగాణకు ఇంకా గండాలు పోలేదని, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజానీకానికి సూచించారు. తెలంగాణ తెచ్చిన కీర్తి తనకు సరిపోతుందని, తెలంగాణ వచ్చాక రెండు సంవత్సరాలు కష్టాలున్నా, తర్వాత రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని, 14 సంవత్సరాలు తెలంగాణ మొత్తం పక్షుల్లా తిరిగామని, తెలంగాణ ప్రజలకేం కావాలో మనకే తెలుస్తుందని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని, ఆంధ్రా పార్టీలకు ఓటేస్తే గోల్ మాల్ అవుతామని, కేంద్రంలో చక్రం తిప్పాలంటే 16 ఎంపీ స్థానాలు గెలిచి చూపించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, పోలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *