mt_logo

కేసీఆర్ తో చర్చించే స్థాయి బాబుకు లేదు – జగదీష్ రెడ్డి

తెలంగాణ భవన్ లో ఆదివారం రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు న్యాయవాదులు, వైద్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ ను ఎదిరించినోళ్ళం కేసీఆర్ ను ఎదిరించలేమా? అని టీడీపీ నేతలంటున్నారని, ఆ వైఎస్, చంద్రబాబులను బండకేసి కొట్టిందే కేసీఆర్ అని తీవ్రంగా విమర్శించారు. ‘మంత్రులను కాపలా కుక్కలని అంటున్నారు. నిజమే మేము తెలంగాణ ప్రజల కోసం కాపలా కుక్కల్లానే ఉంటాం. మేము పనిచేయకపోతే తెలంగాణ ప్రజల కాళ్లు పట్టుకునేందుకు సిద్ధం. జన్మనిచ్చిన తల్లికి కాపలా కుక్కల్లెక్క ఉంటాం కానీ మీ లెక్క తిన్నింటి వాసాలు లెక్కపెట్టం’ అని టీడీపీ నేతలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ఆదర్శ పాలన ఏమిటో ప్రజలకు తెలుసని, చిన్న తప్పు జరిగినా కొడుకు, కూతుర్నైనా జైలుకు పంపిస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం గుర్తుచేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మహేందర్ రెడ్డేనని, జేఎన్టీయూ అనుమతి ఇవ్వని ఇంజనీరింగ్ కాలేజీల్లో మహేందర్ రెడ్డికి చెందిన రెండు కాలేజీలతో పాటు, మరో నాయకుడి కాలేజీ కూడా ఉందని, దీనిపై ఏనాడూ సీఎం కేసీఆర్ తో మాట్లాడలేదని, అధికారులపై ఒత్తిడి తేలేదని, ఇదీ తమ నిజాయితీ అని మంత్రి పేర్కొన్నారు.

చంద్రబాబు కొడుకు లోకేష్ కు ప్రజల్లోకి వచ్చే దమ్ములేక ఇంట్లోనుంచే మా నాన్నతో చర్చకు సిద్ధమా అని అంటున్నాడని, కేసీఆర్ తో చర్చించే దమ్ము మీ నాన్నకు లేదని, ఆయనకు సమాధానం చెప్పడానికి ఒక్క కరెంటు ఉద్యోగి చాలని, ప్రైమరీ స్కూలు పిల్లగాడు కూడా మీ నాన్నకు సమాధానం చెప్తాడని ఎద్దేవా చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పై నమ్మకం లేకే అందరూ టీఆర్ఎస్ లో చేరుతున్నారని, టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు బస్సు యాత్ర చేస్తున్న ఆ పార్టీ నేతలు కరెంట్ కోసం చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని జగదీష్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *