మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఎస్పీ తెలంగాణ శాఖా మాజీ అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాలు కృషి ఉన్నది.. తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదే.. మీరు బీఎస్పి నుంచి వచ్చినవాళ్లు మీ మనసులో ఏముంటదో నాకు తెలుసు అని కేసీఆర్ పేర్కొన్నారు.
నాటి స్వాతంత్ర్య సాధన అనంతరం నెహ్రూ ఆధ్వర్యంలో సాగిన నూతన ప్రభుత్వంలో నాటి సంస్థానీదేశులు దేశ్‌ముఖ్‌లే గాంధీ టోపీలు పెట్టుకుని ప్రజా ప్రతినిధులైండ్రు.. 1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్ కోసం పోరాటం సాగింది.. సుప్రీం కోర్టు కొనసాగించాలని చెప్పినా జై ఆంధ్ర ఉద్యమం తెచ్చి అనచివేసిండ్రు.. 400 మంది చనిపోయిండ్రు… ఆ తర్వాత తెలంగాణ చైతన్యం ఆగమైంది అని అన్నారు.
మనకు ఏమన్న ఎటమటమైతే డీలా పడిపోవడం అలవాటేగా…అట్లా నాడు ఉద్యమం సల్లపడింది. తెలంగాణ అశక్త అయిపోయి అసహాయ పరిస్థితిలో అన్నీ పార్టీల్లో మన నాయకులు బానిసలైపోయారు. ఆంధ్రపాలకులకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే అణచివేత పరిస్థితి ఉండేది. నాకు 1969 నుంచే తెలంగాణ మనసులో ఉంది. అనంతర కాలంలో అనేక అనుభవాలు ఉన్నాయి.. కష్టాలు ఎదుర్కున్న.. ఒక్కరికి కూడా సోయి లేకుండే… తెలంగాణ కోసం పోదాం పా అంటే నువ్వంటవు గానీ అయితాదే అని ఎనకపట్లు పడేవాళ్లు అని గుర్తు చేశారు.
నాటి ఉమ్మడి పాలనలో కరెంటు సహా తెలంగాణకు జరిగిన వివక్ష మీద తాను చేసిన పోరాటం.. ఎన్టీఆర్ హయాంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా తాను పరిష్కరించిన సమస్యలను ఎదురించి నిలిచిన పలు సందర్భాలను కూడా కేసీఆర్ వివరించారు.
అనంతరం చంద్రబాబు హయాంలో ఆయనకు ప్రపంచ బ్యాంకు పిచ్చి పట్టుకుంది.. ఆర్థిక సంస్కరణలు అమలుచేయాలని చూసేవాడు.. తాగునీరు, విద్యుత్ వంటి ప్రజలకు సంక్షేమం అక్కరలేదనే భావన ఆయనకు ఉండేది అని కేసీఆర్ తెలిపారు.
విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు వ్యతిరేకంగా నేను రాజీనామా చేసిన
అనంతరం విద్యుత్ ఉద్యమకారులను కాల్చి చంపేసిండ్రు.. మనం ఎన్ని విజ్ఞప్తులు చేసిన నిర్లక్ష్యం చేసినాడు… దానికి నాకెంతో మానస్తాపం చెంది.. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాలని నిర్ణయించిన.. నాటి 1969 ఉదామకారులతో చర్చలు మొదలుపెట్టి.. ఇది స్ట్రీట్ ఫైటా.. స్టేట్ ఫైటా అని అడిగినా.. దేశంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎందో తెల్వకుంటా రాళ్లు పట్టుకొని ఎంత దూరం ఉర్కుతం.. పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప తెలంగాణ రాదు అన్నప్పుడు అటువంటి విధానమే అనుసరించాలి అని అప్పట్లో తాను తెలపినట్టు గుర్తు చేశారు.
బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలి.. విపరీతమైన మేధోమథనం జరగాలి.. 14 ఏండ్లు రాష్ట్ర సాధనకోసం 10 ఏండ్లు ప్రగతి సాధన కోసం నా ఉద్యమం సాగింది… కోటానుకోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసినవాళ్లు.. మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి.. ఒకసారి కమిట్ అయినంక వెనక్కు రావద్దు అని అన్నారు.
ఈ నడుమ జరిగిన రివ్యూలో మనవాళ్లు చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగించింది.. దళిత బంధు పథకంతో మనకు దెబ్బ పడ్డదని అంటున్నారు కానీ అట్లాంటి ఆలోచన సరికాదు. దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయి.. దళిత సమాజం దీన్ని పాజిటివ్‌గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలి అని పేర్కొన్నారు.
దళిత శక్తితో పాటు బహుజన శక్తి కలిసిపోవాలే అనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేసిండు.. దాన్ని మనం కొనసాగించాలే. బహుజనుల్లో సామాజిక చైతన్య స్థాయిని మరింతగా పెంచాల్సి ఉన్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాడులు జరిగేది దళితుల మీదనే.. పాలకుల మీద ఐకమత్యంతో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలే.. కలెగలిసి పోవాలంటే ఏంచేయాలో ఆలోచన చేయాలి.. అగ్రవర్ణాల్లోని పేదలతో కూడా కలుపుకు పోవాలి… ప్రతీప శక్తులమీద పోరాడుతూనే కలిసివచ్చే శక్తులను కలుపుకపోవాలి.. వారి శక్తిని మనం ఉపయోగించుకోవాలి అని కేసీఆర్ సూచించారు.
20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదే మీ లేదు. రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయి. తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. ఇండియాలో ఏ రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టలే.. దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినం అని అన్నారు.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలే… నా మీద దండకాలు కూడా రాసిండ్రు… ఎన్ని కష్టాలెదురైనా ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదు.. అవసరమైన పంథాను ముందుపెట్టి తెలంగాణ కోసం పోరాటం లో కేంద్రాన్ని గజ్జున వణికించినం.. శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించినం.. గిటువంటి సమస్యలెన్నో చూసినం ఇదో లెక్కగాదు. మీలాంటి యువత నాయకత్వం ఎదిగితే.. ఈ వచ్చిపోయే స్వార్థపరుల అవసరం ఉండదు. వచ్చే ఎన్నికల వరకు మీరంతా నాయకులుగా ఎదగాలే అని కేసీఆర్ తెలిపారు.
దేశంలో ఇంతవరకూ దళిత బంధు వంటి పథకాన్ని ఎవ్వరూ తేలే.. అనేక చర్చలు మేధోమథనం అనంతరమే రైతుబంధు తెచ్చినం.. సాగునీటి ప్రాజెక్టులను తెచ్చినం తద్వారా రాష్ట్రంలో మూడు కోట్ల టన్నులకు ధాన్యం ఉత్పత్తి చేరుకుంది అని అన్నారు.
నాటి ఉద్యమ కాలంలో అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప.. ఎట్లబడితే అట్ల అసభ్యంగా బూతు కూతలకు దిగలే.. నేను పరుష పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు.. పబ్లిక్ లైఫ్ అన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక్కతీరుగా వుండాలే.. మన ప్రజలు మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకుసాగాలె.. అధికారం ఉంటే ఒకతీరు లేకుంటే ఓ తీరు ఉండొద్దు అని తెలిపారు.
అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది.. ఇవి ఎక్కడపోవు.. వచ్చేటాయిన ఎక్కువిస్తాడేమోనని ఆశకు పోయి మోసపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి అటు మల్లిండ్రు…ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమైతున్నది. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు.. గాడిద ఎమ్మటి పోతేనే గదా గుర్రాల విలువ తెలుస్తది అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యు వరకు అందరిని కలిసినం. 36 పార్టీలను ఏకతాటిమీదికి తెచ్చినం
కేంద్ర మంత్రి పదవిని కూడా తెలంగాణ సాధన కోసం ఉపయోగించిన.. తెలంగాణ కోసం.. వచ్చినోళ్లకల్లా ‘తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్’ అనే వీడియో చూపించిన.. హైదరాబాద్ వచ్చినోళ్లకు బిర్యాని తినిపిద్దును.. నన్ను చూడంగానే జోకులు వేసుకునే వాళ్లు.. మళ్ళా వచ్చిండురా అని.. కానీ మన పట్టుదల చూసి అందరూ మద్దతిచ్చింద్రు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాయావతి దగ్గరికి 18 సార్లు పోయిన.. మీ బహుజన్ కాజ్ నా తెలంగాణ కాజ్ ఒకటేనని చెప్పి ఒప్పించిన. ఒక పని సాధించాలంటే పట్టుదల అవసరం అనే విషయం ఉద్యమం మనకు నేర్పుతుంది అని కేసీఆర్ తెలిపారు.
గురుకుల విద్యను అభివృద్ధి చేసి ప్రవీణ్‌కు ఎంతో సహకరించిన. దళిత బహుజన బిడ్డలను విద్యావంతులను చేసిన.. దేశ విదేశాల్లో వాళ్లు ఇవ్వాళ ఉన్నత స్థాయిలో ఎదిగిండ్రు అని అన్నారు.
బీఎస్పీ నుండి వచ్చినవాళ్ళకి ఏ పార్టీలో లేని స్పేస్ బీఆర్ఎస్‌లో ఉంటుంది.. నిరంతర శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం, పార్టీ నిర్మాణం చేసుకుందాం.. కమిటీలు వేసుకుందాం.. మనం అద్భుతమైన విజయం సాధిస్తాం.. బహుజన సిద్ధాంతాన్ని, ఎజెండాని బలంగా అమలు చేసే దిశగా భారత దేశానికి టార్చ్ బేరర్‌గా పనిచేయాలే.. బహుజన బేస్‌ను నిర్మిద్దాం, ఒక అనివార్యతను సృష్టిద్దాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రవీణ్ ఒక డెడికేటెడ్ పర్సన్.. రెసిడెన్షియల్ విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా నిలిపాడు.. మనం కష్టపడితే.. వచ్చే టర్మ్ లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ గెలుస్తుంది అని అన్నారు.
కాంగ్రెస్ పాలన మీద మూడు నెలలకే జనం ముక్కు ఇరుస్తున్నరు.. కనీసం మిషన్ భగీరథ మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేక పోతున్నారో అర్థం కాట్లేదు అని కేసీఆర్ వాపోయారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌ను త్వరలోనే ప్రకటిస్తా.. భవిషత్తులో కూడా ఉన్నత స్థానంలో ఉంటాడు. ప్రవీణ్‌ను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్న.. మంచి ఆశయం కోసం పనిచేసిన మీకు రాజకీయ సామాజిక ఫలితాలుంటాయి.. ఆచరణయోగ్యమైన కార్యాచనతో ప్రజల్లో కలిసి పని చేద్దాం.. ఫలితాలు సాధిద్దాం అని తెలిపారు.
దళిత శక్తిని ఏకం చేసేందుకు.. బలహీన వర్గాలను ఐక్యం చేసేందుకు మనం నడుం కడుదాం, కలిసి ఎజెండా తయారు చేద్దాం.. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వెనక్కుపోలె.. ఇప్పుడు కూడా అంతే ముందుకు పోదాం.. కన్విక్షన్ ఉంటే అసాధ్యం ఏమి వుండదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- Congress targets KTR with baseless slander and orchestrated misinformation campaigns
- KTR slams Rahul Gandhi for double standards on Adani issue
- Demolitions, DPR discrepancies, varying costs: Musi beautification project mired in controversy
- Kavitha exposes Congress party’s deceit on Musi beautification project
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
- అక్రమ కేసులకు, అణిచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం: కేటీఆర్
- ఫార్ములా-ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము రేవంత్‌కు లేదు: కేటీఆర్
- భూభారతి పత్రికా ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్
- స్థానిక సంస్థల బిల్లులో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం
- ఆదానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడు: హరీష్ రావు