సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగురవేసిన సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ భవన్ కు చేరుకోగానే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. కార్యకర్తలంతా కేసీఆర్ రాక సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి అధికారం కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాము తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని, నూటికి నూరు శాతం మేనిఫెస్టో అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో మీడియా సహకారం అందించిందని, తెలంగాణ రాష్ట్రంలో మీడియా పాత్ర ఇలానే కొనసాగాలని , వారికి పార్టీ తరపున, తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మీడియా మిత్రులు సలహాలు ఇవ్వాలని కోరారు. రేపుటీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడానికి టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని, ప్రెస్ మిత్రులు కూడా హాజరుకావాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొందినందున కేసీఆర్ కు అదనపు భద్రత కల్పించారు. అనంతరం కేసీఆర్ గన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు.