సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన రీ ఇన్వెంటెడ్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నవ తెలంగాణ నిర్మాణం దిశగా ముందుకు పోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రణాళికలన్నీ గ్రామస్థాయిలోనే తయారు కావాలని, ఇకపై రూపొందించే చట్టాలు, నిబంధనలు అన్నీ పూర్తిగా తెలంగాణ దృక్పథంతో, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రజలు 60నెలల కోసం అధికారం ఇచ్చారు. ఒకటిరెండు నెలలు జాప్యం జరిగినా ప్రణాళికాబద్ధంగానే ముందుకు పోవాలని, అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించొద్దని సీఎం చెప్పారు. సరైన ప్రణాళిక రూపొందించడంలోనే సగం విజయం దాగిఉందని, ప్లానింగ్ లో లోపముంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తో పోటీ లేదని, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనే పోటీ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న చట్టాలు, మార్గదర్శకాలు, నిబంధనలు ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించినవని, అవి కొంతమేరకే పనిచేస్తాయని, చాలావరకు పనిచేయవని స్పష్టం చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రానికి అనుకూలంగా కొత్త మార్గాలను కనుక్కోవాలని, కింది స్థాయి నుండి ప్రజలకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రజలకు ఉపయోగకరమైన పనులను చేపడదామని సీఎం అధికారులకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో చెరువులు, కుంటల అభివృద్ధికోసం శ్రమదానం చేయాలని, ఆ శ్రమదానంలో తానూ పాల్గొంటానని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమించిన చెరువులను పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీనికోసం ప్రజలు భాగస్వాములై శ్రమదానం చేయాలని కోరారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ రోజురోజుకీ దిగజారుతుందని, అమెరికాలో గ్రామీణాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన భారతసంతతికి చెందిన వ్యక్తి ఎస్ కే డే లాంటి వ్యక్తుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి చెందాలని కేసీఆర్ అన్నారు.