టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కలుస్తుండటంతో ఆయన నివాసం బిజీగా మారింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఇదిలా ఉండగా, మెదక్ జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి ఈ రోజు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు జడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు.
టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జీ పద్మారావు, కేటీఆర్ తదితరులు మజ్లిస్ నేతలైన అక్బరుద్దీన్ వోవైసీ, అసదుద్దీన్ వోవైసీలను కలిసి తమ పార్టీకి సహకరించాల్సిందిగా కోరగా అందుకు వారు సానుకూలంగా స్పందించారు. టీఆర్ఎస్ సారధ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతిస్తామని, తాము ప్రభుత్వంలో చేరడం ముఖ్యం కాదని, దేశంలోనే తెలంగాణను అభివృద్ధి చెందేలా చేయడమే ముఖ్యమని, హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్ష వెలిబుచ్చారు.
ఎంఐఎం నేతలతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, ఎంఐఎం తమ మిత్రపక్షమేనని, అందరినీ కలుపుకుని పోవాలన్నదే తమ ఉద్దేశమని, కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు అభివృద్ధి కావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మజ్లిస్ నేతలతో కలిసి పనిచేసే విషయమై తమ అధినేత కేసీఆర్ త్వరలో భేటీ అవుతారని ఆయన పేర్కొన్నారు.
