తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అమలవుతున్న తీరుపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. మాతా, శిశు మరణాల నియంత్రణ, ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు అమలుచేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాతీయ నాణ్యతా ప్రమాణాల తనిఖీ బృందం కేసీఆర్ కిట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించినవారికి ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగపిల్లాడు పుడితే రూ. 12 వేలతో పాటు కేసీఆర్ కిట్ పేరిట రూ. 2 వేల విలువైన 16 వస్తువులు అందజేయడాన్ని ఆ బృందం అభినందించింది.
ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తుంది. సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. 2017-18 ఆర్ధిక సంవత్సరం తర్వాత 30 శాతం ఉన్న ప్రసవాలు 51 శాతానికి పెరిగాయి. 2017 జూన్ 3వ తేదీన ప్రారంభమైన కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమైన నాటినుండి 2019 జనవరి చివరినాటికి 3,92,707 మంది బాలింతలకు లభ్ధి చేకూరింది. ఇందుకోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 472.24 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం కోసం రూ. 393.50 కోట్లు ఖర్చు చేయగా, కేసీఆర్ కిట్లు అందించేందుకు రూ. 78.74 కోట్లు వెచ్చించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్లు అందజేయడం చూసి పలు రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కిట్లను ఎలాంటి జాప్యం లేకుండా ఉండేలా దవాఖానల్లో అందుబాటులో ఉంచేలా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల చివరివరకు ప్రభుత్వ దవాఖానల్లో జరగనున్న ప్రసవాల సంఖ్య అంచనా ప్రకారం 31 జిల్లాల పరిధిలో 20,562 కిట్లను అందుబాటులో ఉంచడం జరిగింది.