mt_logo

అద్భుత దివ్యక్షేత్రం యాదాద్రి ఆలయం!!

విశ్వఖ్యాతి గడించేలా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉండబోతున్నదని, యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు చెప్పారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనులను ఆదివారం వైటీడీఏ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం దేశంలో ఎక్కడా చేయనివిధంగా 1008 హోమగుండాలతో ప్రపంచంలో దేశం నలుమూలల్లో ఉన్న శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించే పెద్దలతో నిర్వహిస్తామని, చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో బద్రినాథ్ వైష్ణవ పండితులతో పాటు 133 దేశాల నుండి వైష్ణవ పండితులు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వస్తారని అన్నారు.

దేవాలయ పునఃప్రతిష్ఠ సమయంలో ఐదు లక్షల నుండి 15 లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, ఈ కార్యక్రమాన్ని ఓ కార్యకర్తలా తానే దగ్గరుండి జరిపిస్తానని సీఎం ఆన్నారు. ఆలయ నిర్మాణం ప్రపంచదేశాలు అబ్బురపడేలా వెయ్యేండ్లు గుర్తుండేలా ఉంటుందని చెప్పారు. ఇంతపెద్ద కార్యక్రమం రెండు మూడు నెలల్లో పూర్తయ్యేది కాదని, ఎప్పుడు ప్రారంభం అవుతుందో తానే స్వయంగా వచ్చి చెప్తానని, అంతవరకు మీడియా, పత్రికా సోదరులు త్వరపడి ప్రారంభోత్సవం గురించి వార్తలు రాయొద్దని సీఎం సూచించారు.

కేవలం శని, ఆదివారాల్లోనే 70వేలమంది భక్తులు వస్తున్నారంటే ఈ ఆలయానికి ఎంత మహిమ ఉందో అర్ధమవుతుందని, ఇంత గొప్ప ఆలయం సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి టెంపుల్ సిటీ 1,100 ఎకరాల్లో ఉంటుందని, ఇప్పటికే 832 ఎకరాలు తమ స్వాధీనంలో ఉన్నాయని, మరో 250 ఎకరాలు టెంపుల్ వద్ద ఉన్నాయన్నారు. అధునాతన కాటేజీలు నిర్మిస్తామని, ఇప్పటికే 43మంది దాతలు రూ. 2 కోట్లు కాటేజీల కోసం ఇచ్చారని, నిర్మాణానికి సహకరించే దాతలకు సముచితస్థానం ఇస్తామని సీఎం వివరించారు.

143 ఎకరాల్లో భక్తులకు నిత్యాన్నదాన సత్రం, బస్ స్టేషన్, కారు పార్కింగ్, మార్కెట్, క్యూ కాంప్లెక్స్ వంటివి నిర్మిస్తామన్నారు. అన్నదాన సత్రం కోసం హైదరాబాద్, విశాఖపట్నంలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజు వేఘ్నేశ ఫౌండేషన్ అధ్యక్షుడు అనంతకోటి రాజు, కార్యదర్శి ఆనందరాజు రూ. 10 కోట్లు విరాళం అందజేశారని, మరింత విరాళం అందించేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. బస్వాపూర్ ప్రాజెక్ట్ వద్ద అద్భుతమైన కన్వెన్షన్ సెంటర్లు, సినిమా థియేటర్లు, హోటళ్ళు నిర్మిస్తామని, హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ మాదిరిగా భవనాలు నిర్మిస్తామని చెప్పారు. యాదాద్రికి రింగురోడ్డు మంజూరు చేసామని, త్వరలో పనులు పూర్తవుతాయని, భువనగిరి ఖిల్లా, కొలనుపాక, జైన దేవాలయాలను ఉమ్మడి లింక్ పర్యాటక కేంద్రాలుగా మార్చనున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *