ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేసీఆర్ కిట్’ కార్యక్రమంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ సందర్బంగా జనరల్ వార్డు, పిల్లల వార్డులను సందర్శించారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అమ్మ ఒడి వాహన సేవలు, కేసీఆర్ కిట్ల గురించి అడిగి తెల్సుకున్నారు. ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని సూచించారు. కరోనా పరీక్ష కేంద్రం వద్ద చేస్తున్న పరీక్షలను, అందిస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కిట్ లో ఉన్న మందులను వాడుతూ దైర్యంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ, సోకిన వారు ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉందన్నారు. అలా అని నిర్లక్ష్యం చేయవద్దని కరోనా నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సబ్ సెంటర్, పిహెచ్సి స్థాయి నుంచి అన్ని ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచామన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో వంద పడకల కరోనా వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
గజ్వేల్ వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రశంస :
గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. ఆసుపత్రిలో నెలకు 400 డెలివరీ లు చేస్తున్నారనీ తెలిపారు. గజ్వేల్ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే పసిరికలు, ఇతర ఆరోగ్య పరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర వార్డు చక్కగా పని చేస్తుందన్నారు. వైద్యులు పిల్లలకు మంచి సేవలు అందిస్తున్నారని అన్నారు.