అరవై ఏళ్ల కల నెరవేరింది. స్వరాష్ట్రం సిద్ధించింది. అదే రోజు తెలంగాణ ముద్దుబిడ్డ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్ తో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అదేరోజు ఉదయం 7.30 గంటలకు కేసీఆర్ గన్ పార్క్ కు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం రాజ్ భవన్ చేరుకొన్న కేసీఆర్ ను గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రిగా 8.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో హాజరైన కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అనంతరం సచివాలయం చేరుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కేసీఆర్ అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను అధికారికంగా ఆమోదించిన ఫైలుపై, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబందించిన మరో ఫైలుపై కూడా సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. కేసీఆర్ క్యాబినెట్ లోని మంత్రి వర్గం వివరాలు:
* కే చంద్రశేఖర్ రావు – సాధారణ పరిపాలన, ముఖ్యమంత్రి, విద్యుత్, బొగ్గు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు మంత్రులకు కేటాయించని మరికొన్ని శాఖలు.
* ఎండీ మహమూద్ అలీ – రెవెన్యూ, స్టాంపులు, ఉపముఖ్యమంత్రి, రిజిస్ట్రేషన్లు, సహాయ పునరావాస, అర్బన్ లాండ్ సీలింగ్
* టీ రాజయ్య – వైద్యం, ఆరోగ్యం, ఉప ముఖ్యమంత్రి
* నాయిని నర్సింహారెడ్డి – హోం, జైళ్ళు, ఫైర్ సర్వీస్ లు, సైనిక సంక్షేమం, కార్మిక, ఉపాధి కల్పన
* టీ హరీష్ రావు – భారీ నీటిపారుదల, శాసనసభా వ్యవహారాలు, మార్కెటింగ్
* ఈటెల రాజేందర్ – ఆర్ధిక, ప్రణాళిక, చిన్నమొత్తాల పొదుపు, పౌర సరఫరాలు
* పోచారం శ్రీనివాస్ రెడ్డి – వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు
* కేటీ రామారావు – పంచాయితీ రాజ్, ఐటీ
* జోగు రామన్న – అడవులు, పర్యావరణం
* పీ మహేందర్ రెడ్డి – రవాణా
* జీ జగదీశ్వర్ రెడ్డి – విద్య
* టీ పద్మారావు – ఎక్సైజ్, మద్య నియంత్రణ