mt_logo

హస్తినలో కేసీఆర్ హల్‌చల్

టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేంతవరకు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.
సమైక్య రాష్ట్రంలో ఢిల్లీ వెళుతున్నా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా అని గురువారం తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిన ఆయన దానిని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేయనున్నారు. ఫిబ్రవరి 4న ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి తెలంగాణ బిల్లులోని 8 అంశాలపై సవరణలు చేసిన డ్రాఫ్ట్ ను ఇవ్వనున్నారు. ఈ డ్రాఫ్ట్ లో ముఖ్యంగా హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు, ఉద్యోగులు, పెన్షనర్లను జనాభా ప్రాతిపదికగా పంచడం, రెండు రాష్ట్రాలకూ ఒకే విద్యా విధానం, ఉమ్మడి హైకోర్టు, గోదావరి, కృష్ణా నదులపై బోర్డులు ఏర్పాటు చేయడం, ఉమ్మడి రాజధాని పదేండ్లపాటు ఉంచడం మొదలైన అంశాలపై మొదటినుంచీ టీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, మాయావతి, లాలూప్రసాద్, శరద్ పవార్, అజిత్ సింగ్, రాంవిలాస్ పాశ్వాన్ తదితరులను కలిసి తెలంగాణ బిల్లుపై మద్దతు కోరనున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారమే రైల్లో ఢిల్లీ బయలుదేరివెళ్ళగా, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆదివారం నాడు బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తీవ్ర తోపులాట జరిగింది. జైతెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్టు జనసంద్రమైంది. కేసీఆర్ కు వీడ్కోలు చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ వెంట ఢిల్లీ బయలుదేరి వెళ్ళినవారిలో నాయిని నరసింహారెడ్డి, కడియం శ్రీహరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు సుభాష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వినోద్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *