తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఈరోజు ఉదయం 8.15 గంటలకు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఈఎల్ నరసింహన్ కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్ భవన్ ను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఈ వేడుకకు రాజకీయ నేతలతో పాటు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు ఉదయం 7.30 గంటలకు గన్ పార్క్ వద్దనున్న అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులర్పించారు. కేసీఆర్ తో పాటు 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ హాజరై జాతీయజెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ ప్రసంగించారు. ‘ ఈ విజయం ప్రజలది. అనేక గెలుపోటముల తర్వాత తెలంగాణ వచ్చింది. అమరవీరుల త్యాగఫలితమే తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మురికివాడల్లేని నగరంగా అభివృద్ధి చేస్తాం. మహిళలపై ఆగడాలను ఎంతమాత్రం సహించమని, నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని’ అన్నారు.
తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంటు ఇస్తామని, కేంద్రప్రభుత్వ స్కేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో లో చెప్పిన అంశాలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని, పోలీసుల సమస్యలు పరిష్కరిస్తానని, గ్రీన్ హౌస్ సాగును ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.