దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించడంలో పార్టీ కీలక భూమిక పోషించిందన్నారు. తద్వారా తెలంగాణ దేశం గర్వించే రాష్ట్రంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు.
ఇది ప్రజాస్వామిక వాదులందరికీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ గర్వ కారణమని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు 23 ఏళ్లగా పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. ప్రజల స్వరాష్ట్ర స్వయంపాలన ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో దారి దొరకని స్థితిలో ఉన్న తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామిక పార్లమెంటు పంథాలో దిక్సూచిగా నిలిచిందన్నారు.
వేలాది సంఖ్యలో పలు స్థాయిల్లో తెలంగాణ నాయకత్వాన్ని తీర్చిదిద్ది ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నడిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బీఆర్ఎస్‌ది ప్రత్యేక స్థానమన్నారు. పార్టీ సాధించిన విజయాలతో పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటూ పలు మైలురాళ్లు అధిగమించడానికి బలమైన పునాదులు వేసింది పార్టీ కార్యకర్తలేనని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలతో మేధావి వర్గాలతో మమేకమై కొనసాగించిన వారి ఉద్యమ అంకిత భావమే నేటి తెలంగాణ ప్రగతికి కారణమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దన్నుగా నిలుస్తూ వారి ఆదరణ మరింతగా పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతిన బూనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.