తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులతో కొంపల్లిలో సమావేశమయ్యారు. వారి సమస్యలను, అభ్యంతరాలను అడిగితెలుసుకున్న ఆయన ఉద్యోగుల బదిలీ ఎలా ఉండాలన్న విషయంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులందరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఉద్యోగుల సకలజనుల సమ్మె అద్భుతమని, మీడియాలో, వార్తా పత్రికల్లో వస్తున్నట్లు ఉద్యోగుల పంపిణీ జరగదని, తెలంగాణ సచివాలయంలో ఆంధ్రోళ్లు ఎట్లా ఉంటారని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని నడపడానికి తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు సీఎస్ చెప్పారని, ఒక్క ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల పంపిణీ మాత్రమే డీవోపీ ప్రకారం జరుగుతుందని అన్నారు. జూన్ 2 వరకూ ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల పంపిణీ జరగదని కూడా స్పష్టం చేశారు. కావాలని కయ్యానికి కాలు దువ్వితే తాము కొట్లాటకు సిద్ధమని, రాష్ట్రాలు విడిపోయినా స్వేచ్ఛ లేకపోతే సహించేది లేదని, తెలంగాణ ఉద్యోగులు ముందునుంచీ సహనంతో ఉన్నారని పేర్కొన్నారు.
ఎవరి సచివాలయాల్లో వారే ఉండాలని, తెలంగాణ ఉద్యోగులు మాత్రమే తెలంగాణలో ఉండాలని, ఆంధ్రా ఉద్యోగులు ఉండడానికి వీలు లేదని స్పష్టం చేశారు. 6 పాయింట్ ఫార్ములా అమలుకాకపోయినా ఓర్చుకున్నామని, ఇప్పుడు కూడా అన్యాయం జరిగితే సహించమని కేసీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగనివ్వమని, ఉద్యోగులు లేనిది తెలంగాణ ఉద్యమం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం పెద్దదని, అందుకు తగ్గట్లు పని చేయాలని, కేంద్ర ఉద్యోగుల సర్వీసులకు సమానంగా వేతనాలు ఇస్తామని, కొత్త రాష్ట్రంలో అన్ని స్థాయిల ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంటు ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని, రోస్టర్ పద్ధతిలో మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని, దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పవర్ ప్రొడక్షన్ పబ్లిక్ సెక్టార్ లోనే ఉంటుందని, తెలంగాణ జెన్కో నే విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ, చైల్డ్ కేర్ సెలవులను పెంచుతామని, సింగరేణి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.